TS EAPCET 2024 Counselling: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు ... కొత్తగా చేరే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలి
హైదరాబాద్ : ఐఐటీలు, జాతీయఇంజనీరింగ్ కాలేజీల్లో క్లాసుల నిర్వహణకుసన్నాహాలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులను ముందుగా మానసికంగా బలోపేతం చేయాలని కేంద్ర విద్యాశాఖ అన్ని విద్యాసంస్థలను ఆదేశించింది. బోధన ప్రారంభించేముందే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది.
కాలేజీ పరిస్థితులు, తోటి విద్యార్థులతో సమన్వయం, అధ్యాపకులతో సాన్నిహిత్యం ఇందులో కీలకాంశాలుగా తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ విద్యారి్థని సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరగా పరిశీలించాలని, వారిలో భయం పోగొట్టాల్సిన అవసరముందని చెప్పింది. విద్యార్థి పూర్వచరిత్ర, అతనిలో ఉన్న భయం, ఆందోళనను గుర్తించి అవసరమైన ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరింది.
ప్రతీ కాలేజీలోనూ కౌన్సెలింగ్ కేంద్రాల
ఏర్పాటును గత ఏడాది కూడా సూచించింది. విశ్వాసమే బలం అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన వారికే ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇలా ప్రతిభ ఉన్న విద్యార్థులు చిన్న సమస్యలకే బెంబేలెత్తుతున్నారు. భయంకరమైన డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. ఇవి బలవన్మరణాలకు కారణమవుతున్నాయనేది కేంద్ర ఆరోగ్యశాఖతోపాటు ఐఐటీలు జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది.
దేశంలోని ఐఐటీల్లో 2005– 2024 సంవత్సరాల మధ్య 115 మంది విద్యార్థులు తనువు చాలించారు. ఒక్క మద్రాస్ ఐఐటీలోనే 26 మంది విద్యార్థులు చనిపోయారు. ఐఐటీ కాన్పూర్‌లో 18 మంది, ఖరగ్‌పూర్ ఐఐటీలో 10 మంది, ఐఐటీ బాంబేలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ఐఐటీ క్యాంపస్‌లోనే 98 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 17 మంది క్యాంపస్ వెలుపల ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంత భయంకరమైన నిర్ణయా లు తీసుకోవడానికి వారి మానసిక పరిస్థితులే కారణమని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. వారిలో విశ్వాసం సన్నగిల్లడమే కారణమని గుర్తించారు. ఇలాంటి వారిని ముందే తెలుసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ముందుగా విశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలని సూచించింది.
తొలి ఏడాదే కీలకం
ఇప్పటి వరకూ జరిగిన బలవన్మరణాల్లో ఎక్కువమంది తొలి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్‌విద్యలో బట్టీ పట్టే విధానం ఉంది. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఈ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు జేఈఈలో మంచి ర్యాంకులు పొందుతున్నారు. అయితే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో విద్యాబోధన, ప్రాక్టికల్ వర్క్ ఇందుకు భిన్నంగా ఉంటుంది.
విద్యార్థులు తమ స్వీయ ప్రావీణ్యాన్ని వెలికితీయాలి. సొంతంగా ఆలోచించడం, కొత్తదాన్ని అన్వేషించేలా సిలబస్ ఉంటుంది. ఇదంతా కొంతమంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. మొదటి సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మద్రాస్ ఐఐటీ అధ్యయన నివేదికలో పేర్కొంది. వీటిని పరిగణనలోనికి తీసుకొని, తొలి ఏడాది సిలబస్‌లో మార్పు చేయాలని అన్ని ఐఐటీలు భావించాయి.
ఏదేమైనా కాలేజీలో చేరిన విద్యార్థి కి ముందుగా పూర్తిస్థాయి కౌన్సెలింగ్ చేసి, మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని జాతీయ విద్యా సంస్థలు నిర్ణయించాయి. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే విధంగా చేయాలని, ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది.