TS EAPCET 2024 Counselling: ఇంజనీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపు ... 98 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే..
హైదరాబాద్: ఇంజనీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపును సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన సోమవారం విడుదల చేశారు. కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించారు. బ్రాంచీలు, కాలేజీలు మార్పు కోరిన 16,981 మందికి సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో 175 కాలేజీలు పాల్గొన్నాయి. కన్వినర్ కోటా కింద మొత్తం 86,943 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడో దశతో కలిపి 81,904 (92.40 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి.
గతంలో సీట్లు పొందిన విద్యార్థులు బ్రాంచీలు, కాలేజీల మార్పిడి కోసం ఆప్షన్లు ఇచ్చారు. కొత్తగా మరికొంతమంది ఇచ్చినవి కలుపుకుని మొత్తం 23,98,863 ఆప్షన్లు అందినట్టు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,460 సీట్లు కేటాయించారు. ఆరు యూనివర్సిటీలు, 84 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలని, సంబంధిత కాలేజీల్లో 13 నుంచి 17వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: UPSC IFS 2023 Topper Ritvika Pandey : ఫెయిల్ అయ్యా.. కానీ ఐఎఫ్ఎస్‌లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఆ కోరికతోనే..
ఈ నెలాఖరులోగా క్లాసులు మొదలు
వాస్తవానికి మూడోదశ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపట్టాలని నిర్ణయించారు. కానీ సీట్ల పెంపు, అదనపు సీట్ల కేటాయింపు, సీట్ల మదింపునకు సంబంధించిన ప్రైవేటు కాలేజీల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీట్లు రావని తెలియడంతో, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి, ఇంజనీరింగ్ క్లాసులను ఈ నెలాఖరులో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆయా కాలేజీలు వెల్లడించాలని ఆదేశించారు. దీంతో కన్వీనర్ కోటా కింద సీట్లు రాని విద్యార్థులు మిగిలిపోయే యాజమాన్య కోటా సీట్లకు ప్రయత్నించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.
98 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే..
ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్‌లో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర అనుబంధ కోర్సుల్లోనే అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ వంటి బ్రాంచీల్లో సీట్లు తగ్గించాయి. దీంతో ఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. ఐటీ, ఐవోటీ బ్రాంచీల్లో మార్పిడికి అనుమతించారు. దీనికి తోడు కొన్ని సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లో స్వల్పంగా సీట్లు పెరిగాయి.
ఈ బ్రాంచీల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉంటే, 60,362 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,225 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. 98.01 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈసీఈలో 94.38 శాతం, ఈఈఈలో 76.38 శాతం, సివిల్ ఇంజనీరింగ్‌లో 80.16 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 72.38 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
సివిల్, మెకానికల్ సహా అనుబంధ కోర్సుల్లో 7,458 సీట్లు ఉంటే, 5,782 సీట్లు భర్తీ అయ్యాయి. 1,676 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్రి్టకల్ కోర్సుల్లో 16,692 సీట్లు ఉంటే, 14,907 సీట్లు భర్తీ అయ్యాయి. 1,785 సీట్లు మిగిలిపోయాయి.