TRT Notification 2023: ఈ జిల్లాలో 586 పోస్టులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్)కు ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చివరిసారి 2018లో టీఎస్‌పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే చేపట్టనుంది. ఇందులో భాగంగా టీఆర్టీ కంటే ముందే టెట్ నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్‌లో దరఖాస్తులు సైతం స్వీకరించగా.. ఈ నెల 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో టీఆర్‌టీ కోసం దరఖాస్తు తేదీ నుంచి కేవలం 60 రోజుల్లో అంటే నవంబర్ 20 నుంచి అదే నెల 30వ తేదీ మధ్యలో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా పోస్టులు ఖాళీ ఉండగా.. 586 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించడం ఏమిటని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టు, కేటగిరీల వారీగా చూసినా చాలా తక్కువ ఉంటాయని, అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉన్నారని పేర్కొంటున్నారు. పోస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో టెట్‌కు రెండు పేపర్లు కలిపి దరఖాస్తు చేసుకున్న వారు 80 వేలకుపైగా ఉండటంతో ఒక్కో పోస్టుకు 140– 150 మంది పోటీపడే అవకాశం ఉంది.
చదవండి: TS TET 2023 exam: టెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌లో 415 పోస్టులు, నాగర్‌కర్నూల్‌లో 450, నారాయణపేటలో 470, గద్వాల, వనపర్తిలో కలిపి 316 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులు పదోన్నతులకు కేటాయించినా దాదాపు 1,400 పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వమే తక్కువ పోస్టులు భర్తీ చేస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. చాలామంది గతేడాది నుంచి టీఆర్‌టీ కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యలో గురుకుల పోస్టులు పడినప్పటికీ అందులో దాదాపు 80 శాతం కేవలం మహిళలకే కేటాయించడంతో పురుష అభ్యర్థులు ఆశలన్నీ టీఆర్టీ మీదనే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీల ప్ర క్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే అంశంపై ప్రభు త్వానికి స్పష్టత ఉండగా.. మిగిలిన పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇన్నిరోజుల నిరీక్షణతో అసంతృప్తి
ఏడాది కాలంగా టీఆర్టీ పడుతుందని పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో మధ్యలో గురుకుల నోటిఫికేషన్ వచ్చినా.. 80 శాతం పోస్టులు మహిళలకే ఉన్నాయి. ఈ టీఆర్టీలో అయినా ఎక్కువ పోస్టులు ఉంటాయని భావించాం. కానీ ఫలితం లేకుండా నేరుగా నోటిఫికేషన్ ఇచ్చారు. సబ్జెక్టు, రిజర్వేషన్ ఆధారంగా ఒక్కో పోస్టులకు వందల సంఖ్యలో పోటీ ఉంటుంది.
– చిన్నరాజు, టీఆర్టీ అభ్యర్థి, లక్ష్మీపల్లి
చదవండి: TRT Exam: టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
పట్టించుకోకపోవడం దారుణం
ప్రభుత్వం చాలీచాలని పోస్టులు వేయడం వల్ల టీఆర్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతేడాది అసెంబ్లీలో ప్రకటించిన పోస్టులను నమ్ముకుని టీఆర్టీకే సిద్ధమవుతన్నాం. కేడర్ వారిగా తీసుకుంటే జిల్లాలు, రోస్టర్ పద్ధతిలో బీసీలకు చాలా తక్కువ పోస్టులు వస్తాయి. పోస్టులు పెంచాలని విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం.
– కేశవులు, టీఆర్టీ అభ్యర్థి, నిజాలాపూర్
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
టీఆర్టీ అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఒక్కో సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకునేవారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల కనీస వయస్సు 18– 44 మధ్య ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ రెగ్యులర్ సర్వీస్ వారికి ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించగా.. ఈసారి నేరుగా ఆన్‌లైన్‌లోనే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది.