TS TET 2023 exam: టెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: జిల్లాకేంద్రంలో సెప్టెంబరు 15న నిర్వహించే టెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్లలో 15 కేంద్రాల్లో 3,378 మంది మొదటి పేపర్, 14 కేంద్రాల్లో 2,937 మంది పరీక్షలు రాస్తారని వివరించారు. 15వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 135 మంది ఇన్విజిలేటర్లను, 15 మంది చీఫ్ సూపరిటెండెంట్లను, 15 మంది డిపార్టుమెంట్ అధికారులను, 53 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించినట్లు వివరించారు. హాల్‌టిక్కెట్లలో తప్పులుంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సరైనపత్రాలతో వెళ్లి సవరించుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ అజీమ్, శ్రీసెస్‌శ్రీ ఎండీ సూర్యచంద్రరావు, ఉపవైద్యాధికారి రజిత, ఆర్టీసీ, పోలీస్, రెవెన్యూ, ట్రెజరీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.