Skip to main content

TS TET 2024 Results: టెట్‌లో పెరిగిన ఉత్తీర్ణత.. పరీక్ష మళ్లీ రాస్తే ఇది ఉండదు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 12న‌ విడుదల చేశారు. డీఎడ్‌ అర్హతతో నిర్వహించే పేపర్‌–1లో 57,725 మంది (67.13%), బీఈడీ అర్హతతో రాసే పేపర్‌–2లో 21,842 మంది (34.18%) అర్హత సాధించారు.
increased pass percentage in tet  Chief Minister Revanth Reddy releasing results of State Teacher Eligibility Test

2023తో పోలిస్తే ఈ సంవత్సరం పేపర్‌–1లో 30.24 శాతం, పేపర్‌–2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ నిర్వహించారు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు గత ఏడాది నుంచి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రెండేళ్లుగా టెట్‌ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. టెట్‌ సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటు ఉండేలా సవరణ చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో టెట్‌కు వెయిటేజ్‌ ఇస్తారు. ఈసారి ఇన్‌సర్విస్‌ టీచర్లు కూడా ఈ పరీక్ష రాశారు. ప్రతీ పేపర్‌లోనూ దాదాపు 5 వేల మందికిపైగా హాజరయ్యారు.

వాస్తవానికి 80 వేల మంది టీచర్లు టెట్‌ అర్హత పొందాల్సి ఉంది. కానీ 2010కి ముందు నియమించిన టీచర్లకు పదోన్నతుల్లో టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో టెట్‌ రాసే ఇన్‌ సర్విస్‌ టీచర్ల సంఖ్య తగ్గింది. మొత్తం 7 భాషల్లో పరీక్ష నిర్వహించినా, తెలుగు మీడియం నుంచే ఎక్కువమంది హాజరయ్యారు. చదవండి: Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు

మళ్లీ రాస్తే ఫీజు ఉండదు: రేవంత్‌రెడ్డి 

టెట్‌ ఫీజు పెంపుపై పరీక్ష సమయంలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని చెప్పింది. కంప్యూటర్‌ బేస్డ్‌గా టెట్‌ నిర్వహించడంతో ఫీజు పెంచారు. దీనిపై సీఎం రేవంత్‌ స్పందించారు.

ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉండటం వల్లే టెట్‌ ఫీజు తగ్గించలేకపోయామన్నారు. టెట్‌లో ఫెయిల్‌ అయిన వారికి మరోసారి రాసేప్పుడు ఫీజు నుంచి ఉపశమనం ఇస్తామన్నారు.

2024 టెట్‌ ఉత్తీర్ణులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తామని చెప్పారు.

Published date : 13 Jun 2024 02:48PM

Photo Stories