Skip to main content

AP Govt: డీఎడ్‌, బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు

State Government Announcement  DSC Notification 2024    TET and DSC Schedule Announced by State Government  AP Govt Good News for DED and BED Candidates  Opportunities for Employment in Government-Owned Schools

నెల్లూరు(టౌన్‌): ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌–2024ను విడుదల చేసింది. టెట్‌, డీఎస్సీకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 346 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. వీటితోపాటు అదనంగా రాష్ట్రస్థాయిలో పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ కోచింగ్‌ కోసం వచ్చిన విద్యార్థులతో ఆయా సెంటర్లు కళకళలాడుతున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులు పుస్తకాలు, మెటీరియల్‌తో కుస్తీ పడుతున్నారు.

పోస్టుల భర్తీకి చర్యలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాతిపదికన ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో 3,464 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 9 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 346 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వీటిలో 104 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, 140 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 102 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు అదనంగా ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ, గిరిజన ఆశ్రమ తదితర పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

షెడ్యూల్‌ ప్రకటన
ఉపాధ్యాయ పోస్టులను టెట్‌, డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెట్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, 18వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ, 19న ఆన్‌లైన్‌ నమూనా పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 10న ప్రాథమిక కీ, 13న తుది కీ, 14న ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే డీఎస్సీకి ఈ నెల 12న నోటిఫికేషన్‌, ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, 22వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ, 24న ఆన్‌లైన్‌ నమూనా పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచడం, మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ, ఏప్రిల్‌ 2న తుది కీ, 7వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

విద్యార్థులతో కోచింగ్‌ సెంటర్లకు కళ
రాష్ట్ర ప్రభుత్వం టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో నిరుద్యోగులతో ఆయా కోచింగ్‌ సెంటర్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా కోచింగ్‌ తీసుకునేందుకు నెల్లూరుకు వస్తున్నారు. దీంతో గతంలో ఉన్న కోచింగ్‌ సెంటర్లతోపాటు కొత్తవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గ్రూపు–1, గ్రూపు–2 పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తాజా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా రావడంతో నిరుద్యోగులతోపాటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య 346
స్కూల్‌ అసిస్టెంట్‌ 140
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 104
ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులు 102

విద్యకు అధిక ప్రాధాన్యం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. 2,400కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. అంతేకాకుండా ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి టీచర్లు తక్కువగా ఉన్న పాఠశాలలకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ పేరుతో 500 మందికి పైగా టీచర్లను తాత్కాలికంగా బదిలీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, స్మార్ట్‌ టీవీలు, డిజిటల్‌ బోధన, ట్యాబ్‌ల ద్వారా బైజుస్‌ కంటెంట్‌తో అత్యుత్తమ బోధన, సీబీఎస్‌ఈ సిలబస్‌ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఎక్కడా ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉండకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
 

Published date : 13 Feb 2024 11:48AM

Photo Stories