Shane Warne Records: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డులు ఇవే..
![Shane Warne Records](/sites/default/files/images/2022/03/05/shane-warne-passes-away-photo-gallery3-1646479895.jpg)
క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తూ..
52 ఏళ్ల వయసులోనే తనువు చాలిస్తానని బహుశా వార్న్ ఊహించి ఉండడు. శుక్రవారం ఉదయమే వార్న్ తన దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించాడు.. అదే సయమంలో తనను మరణం వెంటాడుతుందని అతను ఊహించలేకపోయాడు... క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తూ గుండెపోటుతో అకాల మరణం చెందిన వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక కథనం...
1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా..
![Shane Warne](/sites/default/files/inline-images/Shane-Warne.jpg)
1969, సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించాడు. 1983-84 మధ్య కాలంలో అండర్-16 విభాగంలో యునివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ తరపు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అండర్-19 విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వార్న్ అనతికాలంలోనే మంచి క్రికెటర్‌గా ఎదగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి ముందు వార్న్ కేవలం ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడడం విశేషం. ఇక సిడ్నీ వేదికగా 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
అక్కడి నుంచి వార్న్ తన కెరీర్‌లో..
![Shane Warne records](/sites/default/files/inline-images/Shane%20Warne%20Passes%20Away%20Photo%20Gallery_5.jpg)
తొలి మ్యాచ్‌లో రవిశాస్త్రిని ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ అందుకున్నాడు. కెరీర్ మొదట్లో సాధారణ బౌలర్‌గా కనిపించిన వార్న్.. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్‌లోనూ పెద్దగా రాణించలేదు. ఇక వార్న్ కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం వెస్టిండీస్ సిరీస్ అని చెప్పొచ్చు. మెల్‌బోర్న్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో వార్న్ తొలిసారి తన బౌలింగ్ పవర్‌ను చూపించాడు. లెగ్ స్పిన్ మ్యాజిక్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఏడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అక్కడి నుంచి వార్న్ తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
క్రికెట్ చరిత్రలో..
![records](/sites/default/files/inline-images/shanewarneausraliadead_1200x768_0.jpg)
1993లో ప్రతిష్టాత్మక యాషెస్ టూర్‌కు వార్న్ ఎంపికయ్యాడు. ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 34 వికెట్లు తీసిన వార్న్ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో మిగిలిపోయింది. లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టడం క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరించింది. అందుకే వార్న్ వేసిన ఆ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.
వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా..
![cricketer](/sites/default/files/inline-images/Shane%20Warne%20Passes%20Away%20Photo%20Gallery_6.jpg)
ఇక ఆ ఏడాది క్యాలెండర్ ఇయర్‌లో 71 వికెట్లు తీసిన వార్న్ .. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. అప్పటినుంచి 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనే వార్న్ టెస్టుల్లో 3154 పరుగులు సాధించాడు. సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే.
షేన్ వార్న్ సాధించిన రికార్డులు..
![Shane Warne](/sites/default/files/inline-images/13sk.jpg)
➤అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షేన్ వార్న్. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు
➤టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల హాల్.. 10 సార్లు 10 వికెట్ల హాల్ ఘనత
➤టెస్టుల్లో 700 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్‌గా వార్న్ రికార్డు
➤రెండుసార్లు అల్మానిక్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొందిన క్రికెటర్‌గా వార్న్ చరిత్ర.
➤అంతేకాదు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు రెండుసార్లు ఎంపికైన క్రికెటర్‌గా గుర్తింపు
➤ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా షేన్ వార్న్ గుర్తింపు.. (1993లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 71 వికెట్లు)