AP Budget 2022: 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు
AP Assembly Budget Sessions 2022-23: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సభలో ప్రసంగిస్తూ.. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.
60 నుంచి 62 ఏళ్లకు..
ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు.
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన..
రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.