Union Budget 2023-24 Records : ఆర్థిక మంత్రిగా.. నిర్మలా సీతారామన్ రికార్డులు ఇవే.. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయనే..
ఇంధిరా గాంధీ కూడా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎక్కువ సార్లు(ఐదు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది నిర్మలమ్మనే. ఈ జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు పద్దును ప్రవేశపెట్టారు. దీంట్లో 1959-60 నుంచి 1963-64 మధ్య వరుసగా ఐదు పద్దులు పార్లమెంట్ ముందుంచారు.
Budget 2023 LIVE Updates: కేంద్ర బడ్జెట్ 2023-24.. లైవ్ అప్‌డేట్స్
కేంద్ర ఆర్థిక మంత్రులు- బడ్జెట్ వివరాలు..
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి చివరి రోజు నుంచి నెల ఆరంభానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే కొత్త సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారు. 2019-20 మధ్యంతర బడ్జెట్ నాటికి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆ బడ్జెట్‌ను ఆయనే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం సీతారామన్‌కు ఆర్థికశాఖ బాధ్యతల్ని అప్పగించింది. మరోవైపు సంప్రదాయంగా వస్తున్న బ్రీఫ్‌కేస్ విధానాన్ని పక్కనపెట్టి ‘బాహీ- ఖాతా’గా పిలిచే వస్త్రంతో కూడిన ఎరుపు రంగు సంచిలో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకొచ్చే ఆనవాయితీని ప్రారంభించారు.
రికార్టులు ఇవే..
పి.చిదంబరం 2004-05 నుంచి 2008-09 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి హోదాలో యశ్వంత్ సిన్హా 1998-99 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1999 సాధారణ ఎన్నికల తర్వాత 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు కేంద్ర పద్దును పార్లమెంట్ ముందుంచారు. ఈయన హయాంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.పీ.వీ. నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. 1991-92 నుంచి 1995-96 వరకు ఆయన పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక సరళీకరణలతో కూడిన 1991-92 బడ్జెట్ దేశ గతిని మార్చిన సంగతి అందరికీ తెలిసిందే.