Skip to main content

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘమైన చర్చలు, బుజ్జగింపుల తర్వాత వెనుకబడిన తరగతికి చెందిన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, ఒక్కళిగ సామాజికవర్గానికి చెందిన శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది.
Siddaramaiah

మే 18న‌ సీఎంగా సిద్ధరామయ్య పేరును ఢిల్లీలో అధిష్టానం ఖరారు చేయడం, సాయంత్రం బెంగళూరులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమై, తమ శాసనసభాపక్ష నేత(సీఎల్పీ)గా ఆయనను లాంఛనంగా ఎన్నుకోవడం, వెంటనే రాష్ట్ర గవర్నర్‌ తావర్‌చంద్‌ గహ్లోత్‌ను సిద్ధరామయ్య కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడం మెరుపు వేగంతో జరిగాయి. సీఎల్పీ కొత్త నేతగా సిద్ధరామయ్య పేరును ప్రతిపాదిస్తూ డీకే ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇతర నేతలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు తెలియజేశారు.  

అధికారం చెరి సగం!    
అధికారం చెరో 30 నెలలు అధికార పంపిణీ సూత్రాన్ని ఏఐసీసీ ప్రతిపాదించినట్లు తెలిసింది. మొదటి 30 నెలలు సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్‌ డిప్యూటీ సీఎంగా, ఆ తర్వాత 30 నెలలు డీకే శివకుమార్‌ సీఎంగా, సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా కొనసాగేలా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మే 18న‌ ఉదయం కేసీ వేణుగోపాల్‌ తన నివాసంలో అల్పాహార విందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఆహ్వానించారు. రణదీప్‌సింగ్‌ సూర్జేవాలాతో కలిసి ఇరువురు నేతలతో చర్చించారు. హైకమాండ్‌ నిర్ణయాన్ని వివరించి, అధికార పంపిణీకి ఒప్పించారు. అల్పాహార విందు భేటీ తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఒకే కారులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కలసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని పంపించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

మల్లికార్జున ఖర్గే తన నివాసంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో చర్చించారు. వారికి ఆశీస్సులు అందజేశారు. సిద్ధూ, శివకుమార్‌తో జరిగిన తన భేటీ చిత్రాన్ని ఖర్గే ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 6.5 కోట్ల మంది కన్నడిగులకు తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసేందుకు వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ ఇరువురికి రాహుల్‌ గాంధీ సూచించారు.   

సిద్ధూ.. అనుభవమే ఆభరణం
సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధుల బలం కలిసి వచ్చిన సిద్దరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజకీయాల్లో కొత్తలో కాంగ్రెస్‌కు వ్యతిరేకి అయిన ఆయన ఆ పార్టీ నుంచి రెండు సార్లు సీఎం కావడం విశేషం. 
☛ మైసూరు జిల్లా సిద్దరామనహుండి గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో 1948 ఆగస్టు 12న జన్మించారు. రాష్ట్రంలో మూడో అతి పెద్ద సామాజిక వర్గమైన కురుబకు చెందిన నేత. లా చదివి కొన్నాళ్లు ప్రాక్టీస్‌ చేశారు. రైతు ఉద్యమాల్లో పాల్గొంటూ, వారి కేసుల్ని వాదిస్తూ రైతు లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు.

Mount Everest: 53 ఏళ్ల వయసులో 27వసారీ ఎవరెస్ట్‌నెక్కి.. తన రికార్డు తానే..
☛ 1983లో  రాజకీయాల్లో అడుగుపెట్టారు. జనతా పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. భారతీయ లోక్‌దళ్‌ పార్టీ తరఫున  పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు
☛ అదే ఏడాది రామకృష్ణ హెగ్డే ఆధ్వర్యంలో జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
☛ ఆ తర్వాత ఎన్నికల్లో జనతాదళ్‌ పార్టీ నుంచి చాముండేశ్వరి నుంచి అయిదు సార్లు నెగ్గారు. మూడు సార్లు ఓడిపోయారు.  
☛ 1996లో జనతాదళ్‌ పార్టీ చీలిపోయినప్పుడు, దేవేగౌడ నేతృత్వంలో జేడీ(ఎస్‌) చీలిక పక్షానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు
☛ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లోనే సీఎం కావాలన్న బలీయమైన ఆకాంక్షతో మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు దళితులతో కూడిన అహిందా అనే ఫార్ములాతో ఆయా వర్గాల వారికి చేరువ కావడానికి రాష్ట్రమంతటా పర్యటించారు. సిద్దరామయ్య చర్యతో ఇరకాటంలో పడిన హెచ్‌.డి. దేవెగౌడ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారు.
☛ దీంతో 2006లో జేడీ(ఎస్‌)కు గుడ్‌బై కొట్టేసి కాంగ్రెస్‌లో చేరారు. 
☛ 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గడంతో సీఎం పదవి చేపట్టారు. రాష్ట్రంలో దేవ్‌రాజ్‌ తర్వాత పూర్తి కాలం సీఎంగా ఉన్నది ఈయనే
☛ 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్‌)ల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్, జేడీ(ఎస్‌) ప్రభుత్వం కూలిపోవడం వెనుక సిద్దరామయ్య హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
డీకే శివకుమార్‌.. ట్రబుల్‌ షూటర్‌
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిపించే బాధ్యతని తన భుజస్కంధాలపై మోసిన నాయకుడు. సీఎం పదవిపై ఆశపడి అయిదు రోజులు మొండిపట్టు పట్టినా చివరికి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు విలువనిచ్చిన వీరవిధేయుడు.  
☛ రాష్ట్రంలోని కనకపురలో దొడ్డలహళ్లి కెంపె గౌడ, గౌరమ్మ దంపతులకి 1962 మే 15న జన్మించారు. వొక్కలిగ సామాజిక వర్గీయుడు. కర్ణాటక రాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పొందారు.
☛ 1980లో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి  అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు
☛ 1989 అసెంబ్లీ  ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో తొలిసారిగా సాథనూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  అప్రతిహతంగా ఎనిమిది సార్లు విజయం సాధించారు. 1989 నుంచి 2004 వరకు సాథనూర్‌ నుంచి 2004 నుంచి 2023 వరకు తన స్వస్థలమైన కనకపుర నుంచి ఎన్నికయ్యారు. కనకపుర నియోజకవర్గాన్ని తనకి కంచుకోటగా మార్చుకున్నారు.
☛ బంగారప్ప, ఎస్‌.ఎం. కృష్ణ, సిద్దరామయ్య హయాంలలో మంత్రిగా వ్యవహరించారు. 
☛ కాంగ్రెస్‌ సంక్షోభ సమయాల్లో ఉన్నప్పుడు కాపాడుతూ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2002లో మహారాష్ట్రలో విలాస్‌రావు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతని శివకుమార్‌ తీసుకున్నారు. 

CJ Mishra: సుప్రీంకోర్టు జడ్జిగా ఏపీ సీజే జస్టిస్‌ మిశ్రా
☛ 2017 రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌ పటేల్‌ను గెలిపించిన ఘనత శివకుమార్‌దే. అప్పుడు కూడా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి గుజరాత్‌ రిసార్ట్‌లో ఉంచి పటేల్‌ నెగ్గేలా చేశారు. 
☛ 2018లో హంగ్‌ అసెంబ్లీ వచ్చినప్పుడు కాంగ్రెస్, జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భాగస్వామి అయ్యారు. 
☛ 2018 సెప్టెంబర్‌లో శివకుమార్‌పై ఈడీ కేసులు నమోదయ్యాయి.  
☛ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి పగ్గాలు అందుకొని వ్యూహాత్మకంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేశారు. దాని ఫలితంగానే కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించింది. 
☛ 2019 సెప్టెంబర్‌ 3న మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్‌ చేసింది. నెలరోజులకి పైగా తీహార్‌ జైల్లో గడిపారు.
☛ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన అత్యంత ధనికుల్లో శివకుమార్‌ది మూడోస్థానం. నియోజకవర్గంలో కేవలం ఒక్క రోజు ప్రచారంతో తన ప్రత్యర్థిపై లక్షకు పై చిలుకు మెజార్టీతో విజయం సాధించడం మరో సంచలనం.

Somesh Kumar: సీఎం ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్‌

Published date : 19 May 2023 04:37PM

Photo Stories