Skip to main content

CJ Mishra: సుప్రీంకోర్టు జడ్జిగా ఏపీ సీజే జస్టిస్‌ మిశ్రా

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతోపాటు, సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం మే 16న‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
CJ Mishra

జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలు ఇటీవల పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 32కు తగ్గింది. జూలై రెండో వారం కల్లా మరో నలుగురు న్యాయమూర్తులు రిటైర్‌ కానున్నారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 28కి పడిపోనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరి పేర్లను సిఫారసు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో  సమావేశమైన కొలీజియం పేర్కొంది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులు. జస్టిస్‌ మిశ్రా ఎంపికపై కొలీజియం తీర్మానం వివరణ ఇచ్చింది.

‘జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా 13 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. హైకోర్టు న్యాయమూర్తుల ఆల్‌ ఇండియా సీనియారిటీ జాబితాలో 21వ స్థానంలో ఉన్నారు. సుమారు 12 ఏళ్లపాటు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ మిశ్రా పలు న్యాయ రంగాల్లో గణనీయమైన అనుభవాన్ని సంపాదించారు. జస్టిస్‌ మిశ్రా ఇచ్చిన తీర్పులు చట్టం, న్యాయానికి సంబంధించిన అనేక సమస్యలను స్పృశించాయి. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారెవరూ లేరు. 2009 మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ప్రస్తుత అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్‌ పీకే మిశ్రా కన్నా సీనియర్‌ ర్యాంకులో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని విధాలా పరిగణించి జస్టిస్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తగిన వారిగా నిర్ణయించాం’ అని కొలీజియం తీర్మానంలో పేర్కొంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)

కేవీ విశ్వనాథన్‌ పేరునూ..
అదేవిధంగా, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఒక్కరే ప్రస్తుతం బార్‌ అసోసియేషన్‌ నుంచి నేరుగా సుప్రీం జడ్జిగా ఎంపికై కొనసాగుతున్నారు. అందుకే సీనియర్‌ న్యాయవాది అయిన కేవీ విశ్వనాథన్‌ పేరును బార్‌ ప్రాతినిధ్యంగా పరిగణిస్తూ సిఫారసు చేస్తున్నట్లు కొలీజియం వివరించింది. తమిళనాడుకు చెందిన విశ్వనాథన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు. జస్టిస్‌ జేబీ పార్దివాలా 2030 ఆగస్ట్‌ 11న రిటైరవుతారు. ఆయన తర్వాత సుప్రీంకోర్టులో కేవీ విశ్వనాథనే అత్యంత సీనియర్‌. కొలీజియం సిఫార్సును కేంద్రం ఆమోదించి ఆయన సుప్రీంకోర్టులో జడ్జి అయితే తర్వాతి కాలంలో ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.
సీజేఐగా ఈయన 2031 మే 25వ తేదీ వరకు 9 నెలలపాటు కొనసాగే అవకాశాలున్నాయని కొలీజియం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆగస్టు 29, 1964లో జన్మించారు. డిసెంబర్‌ 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అక్టోబర్‌ 13, 2021న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్‌గా డీజీపీ ప్రవీణ్‌ సూద్‌
 

Published date : 18 May 2023 08:18AM

Photo Stories