Skip to main content

Karnataka CM Announcement Live Updates : ఎట్ట‌కేల‌కు సిద్ధరామయ్యకే సీఎం పీఠం.. ఈయ‌న ప్రస్థానం ఇదే.. ఎన్నో..

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ మే 18వ తేదీన (గురువారం) అధికారిక ప్రకటన చేసింది.
Karnataka New CM Siddaramaiah Announcement Telugu news
Karnataka New CM Siddaramaiah

కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్‌ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. 

మే 20వ తేదీ (శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.

సిద్ధరామయ్య జీవిత‌ ప్రస్థానం ఇదే..

Karnataka New Chief Minister Siddaramaiah

ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సిద్ధరామయ్య.. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే స్థాయికి ఎదిగారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను అందుకున్నారు. ఎన్నో పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సిద్ధరామయ్య.. చివరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు.

☛☛ Election Commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?

9 సార్లు ఎమ్మెల్యే.. 3 సార్లు మంత్రి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా..

karnataka new cm Siddaramaiah news telugu

9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో 3 సార్లు మంత్రిగా.. ఒక సారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సిద్ధరామయ్య.. అప్పటి వరకు గత 40 ఏళ్లలో ఎవరూ లేని విధంగా.. 5 సంవత్సరాలు పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఉన్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా 2023లో మ‌రో సారి ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకున్నారు.

☛☛ Indian Politics: భార‌త రాజ‌కీయాల్లో తండ్రీకూతుళ్ల‌దే ఇప్ప‌టికీ రికార్డు... ఆ రికార్డు ఏంటో మీరు ఓ లుక్కేయండి.!

ఈ 4 దశాబ్దాల ప్రస్థానంలో పలు ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానాన్నిప్రారంభించిన సిద్ధరామయ్య.. జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ పార్టీల్లో చేరారు. తర్వాత 2006 లో కాంగ్రెస్‌లో చేరి కీలక నేతగా ఎదిగారు.

రాజకీయ ప్రస్థానం ఇదే..

karnataka Siddaramaiah political life story

1983లో తొలిసారి కర్ణాటక శాసనసభకు పోటీ చేసిన సిద్ధరామయ్య అప్పటి నుంచి ఇప్పటివరకు 9 సార్లు విజయదుందుభి మోగించారు. 3 సార్లు ఓటమి పాలయ్యారు. అయితే తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సిద్ధరామయ్య.. ఆ తర్వాత వివిధ పార్టీల్లో చేరారు. చివరికి హస్తం పార్టీలోకి వచ్చిచేరి ముఖ్యమంత్రి అయ్యారు. 

☛☛ Election Commission: దేశంలోని ఓటర్ల సంఖ్య‌ 94.5 కోట్లు

1983 లో చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి పాత మైసూరు ప్రాంతంలో పాపులర్ అయ్యారు. తర్వాత 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి చాముండేశ్వరీ స్థానంలో విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం జనతా దళ్‌లో చేరిన సిద్ధరామయ్య 1989లో తొలి ఓటమిని చవిచూశారు. 1994 ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి గెలుపొంది మరోసారి మంత్రి అయ్యారు.

వరించిన‌.. ఉన్నత పదవులు ఇవే..

karnataka Siddaramaiah details in telugu


1996 లో సిద్ధరామయ్యను ఉపముఖ్యమంత్రి పదవి వరించగా.. 1999లో మంత్రి పదవి కోల్పోయారు. 1999లో జనతాదళ్ యునైటెడ్‌లో చేరిన సిద్ధరామయ్య ఆ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచారు. 2005 లో జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ.. సిద్ధరామయ్యను పార్టీ నుంచి బహిష్కరించారు. బెంగళూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో సిద్ధరామయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

అనంతరం 2006లో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరీ నుంచి కేవలం 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత నియోజకవర్గం మార్చుకుని 2008, 2013 ఎన్నికల్లో వరుణ నుంచి విజయం సాధించారు. దీంతో 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటివరకు 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన తొలి సీఎంగా సిద్ధరామయ్య నిలిచారు. 2018లో రెండు స్థానాల్లో పోటీ చేయగా.. చాముండేశ్వరీలో ఓడిపోయి, బదామీ స్థానంలో గెలిచారు.

karnataka Siddaramaiah details in telugu

2018లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2019లో 15 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా.. 12 స్థానాలు గెలుస్తామని నాయకత్వం వహించిన సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కానీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించడంతో సిద్ధరామయ్య నాయకత్వంపై పార్టీలో అసమ్మతి తలెత్తింది.
దీంతో సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు.

కుటుంబ నేప‌థ్యం :
మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరమణహుండీలో సిద్ధరామే గౌడ, బోరమ్మ దంపతులకు 1947 ఆగస్ట్ 3న సిద్ధరామయ్య జన్మించారు. కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. కుటుంబంలోని ఐదుగురు సంతానంలో సిద్ధరామయ్య రెండోవాడు.

మైసూరు యూనివర్సిటీ నుంచి సిద్ధరామయ్య బీఎస్సీ, ఎల్ఎల్‌బీ పట్టాలు అందుకున్నారు. అనంతరం మైసూరు లా ప్రాక్టీస్ చేశారు. సిద్ధరామయ్య భార్య పార్వతి. వీరికి ఇద్దరు సంతానం కాగా.. పెద్ద కుమారుడు 38 ఏళ్ల వయసులో అవయవాలు పనిచేయక 2016లో చనిపోయారు. చిన్న కుమారుడు యతీంద్ర.

Remote voting: ఓటు వలస వెళుతుందా.. రిమోట్‌ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి!

Published date : 18 May 2023 12:38PM

Photo Stories