Skip to main content

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Tampering of EVMs is impossible says Supreme Court if India  Electronic Voting Machine

పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలను ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇవి పూర్తిగా భద్రతతో కూడినవని తేల్చిచెప్పింది. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్లు ఇప్పటిదాకా ఎక్కడా నిర్ధారణ కాలేదని పేర్కొంది.

ఈవీఎంలపై అనుమానాలు నిరాధారమని తేల్చిచెప్పింది. ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చడం(క్రాస్‌–వెరిఫికేషన్‌) కుదరని వెల్లడించింది. 

ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను క్రాస్‌–వెరిఫికేషన్‌ చేయాలని, వీవీప్యాట్‌ స్లిప్పులు బ్యాలెట్‌ బాక్సులో వేయాలని, ఎన్నికల్లో మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానం తీసుకురావాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 28వ తేదీ ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. ఈవీఎంలపై వస్తున్న అపోహలు, అనుమానాలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి, వాటన్నింటినీ ధర్మాసనం నివృత్తి చేసుకుంది. అనంతరమే తీర్పు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది.  

Health Insurance Plan: వృద్ధులకు ఆరోగ్య ధీమా!

సింబల్‌ లోడింగ్‌ యూనిట్లు భద్రపర్చాలి  
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తన తీర్పును వెలువరిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సింబల్‌ లోడింగ్‌ యూనిట్లను(ఎస్‌ఎల్‌యూ) సీల్‌ చేసి, కంటైనర్‌లో భద్రపర్చి, ఈవీఎంలతోపాటు స్ట్రాంగ్‌రూమ్‌లో కనీసం 45 రోజులపాటు స్టోర్‌ చేయాలని చెప్పారు.

రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈవీఎంల తయారీ సంస్థకు చెందిన ఇంజినీర్లు ఆయా యంత్రాల మైక్రో కంట్రోలర్లను ధ్రువీకరించడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాలు ప్రకటించిన ఏడు రోజుల లోపు తగిన రుసుము చెల్లించి మైక్రో కంట్రోలర్ల ధ్రువీకరణను ఎన్నికల్లో రెండు, మూడో స్థానాల్లో నిల్చిన అభ్యర్థులు కోరవచ్చని, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్‌కు గురైనట్లు తేలితే ఆ సొమ్ము సదరు అభ్యర్థులకు తిరిగి చెల్లించాలని సూచించారు.  

ఈవీఎంలతో లాభాలివే..  
ఈవీఎంలను తారుమారు చేయొచ్చనే పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈవీఎం, వీవీప్యాట్‌ ఉపయోగాలను వివరించింది. ‘ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. బటన్‌ నొక్కడం ద్వారా ఓటు నమోదవుతుంది. దీనివల్ల బ్యాలెట్‌ పేపర్‌తో ఎదురయ్యే చెల్లని ఓట్ల వంటి సమస్యలు ఉండవు.

నిమిషానికి నాలుగు కంటే ఎక్కువ ఓట్లను ఈవీఎం అనుమతించదు. దీంతో పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణకు అవకాశం ఉండదు. ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతుంది. ఈవీఎంలో బీప్‌ సౌండ్‌ ద్వారా తమ ఓటును ఓటర్లు తక్షణమే ధ్రువీకరించుకోవచ్చు. వీవీప్యాట్‌ స్లిప్పును ప్రత్యక్షంగా చూడొచ్చు’ అని తెలిపింది.   

Supreme Court: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రతి చరాస్తినీ వెల్లడించనక్కర్లేదు

ఆ స్లిప్పులు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదు  
ఓటర్లు వీవీప్యాట్‌ స్లిప్పులు తీసుకొని బ్యాలెట్‌ బాక్సులో వేయాలన్న అభ్యర్థన కూడా తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తమ ఓటు కచ్చితంగా నమోదు అయిందని, లెక్కించడానికి వీలుగా ఉందని నిర్దారించుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని వివరించింది. అయితే వీవీప్యాట్‌ స్లిప్పులను వంద శాతం భౌతికంగా లెక్కించాలనడం ఆ హక్కుతో సమానం కాదని అభిప్రాయపడింది. ఓటర్ల హక్కులు ఇతర చర్యల ద్వారా కాపాడవచ్చని వెల్లడించింది.

సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం కేసు తర్వాత వీవీప్యాట్‌లు ప్రవేశపెట్టారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ లేదా అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఐదు పోలింగ్‌ స్టేషన్లలోని వీవీప్యాట్‌ల లెక్కింపు ప్రారంభమైందని ధర్మాసనం గుర్తుచేసింది. ఓటర్లకు భౌతికంగా వీవీప్యాట్‌ స్లిప్పులు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఇలా స్లిప్పులు ఇచ్చే విధానం దుర్వినియోగం, వివాదాలకు దారి తీసే అకాశం ఉందని పేర్కొంది. 2019 ఎన్నికల్లో 20,687 వీవీప్యాట్‌ల స్లిప్పులను భౌతికంగా లెక్కించారని, ఒక్క దాంట్లోనూ మిస్‌మ్యాచ్‌ గుర్తించలేదని ధర్మాసనం గుర్తుచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ 63లో ఈవీఎంలో వ్యత్యాసం గుర్తించారని తెలిపింది. ఈవీఎంలో మాక్‌ పోలింగ్‌ డేటాను ప్రిసైడింగ్‌ అధికారి తొలగించకపోవడంతో ఆ వ్యత్యాసం వచ్చినట్లు తేలిందని పేర్కొంది.    

Dommaraju Gukesh: చదరంగానికి మన దేశం నుంచి వచ్చిన తెలుగు కుటుంబానికి చెందిన చిచ్చరపిడుగు ఇత‌నే!!

మళ్లీ బ్యాలెట్‌ ఓటింగ్‌తో నష్టమే    
బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తన తీర్పులో తోసిపుచ్చారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో కొన్ని లోపాలు, నష్టాలు ఉన్నాయని తెలిపారు. ఆ పాత విధానానికి మళ్లీ వెళ్లడం అనేది ఎన్నికల సంస్కరణలు రద్దు చేయడమే అవుతుందని పేర్కొన్నారు. దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు, పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య, పేపర్‌ బ్యాలెట్‌తో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానానికి వెళ్లాలని చెప్పలేమన్నారు.

ఈ అంశంపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా స్పందిస్తూ.. పేపర్‌ బ్యాలెట్‌ వ్యవస్థకు మళ్లీ తీసుకురావడం అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదని, ఈవీఎంలను మరింత అభివృద్ధి చేసి, మెరుగైన ఎన్నికల వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలపై ఓటర్లలో సందేహాలు సృష్టించడం ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారన్న ఎన్నికల సంఘం వాదనతో ఆయన ఏకీభవించారు.

Election Ink: చెరిగిపోని సిరా చుక్క.. దీని వాడకం మొదలైంది ఎప్పుడంటే..
Published date : 27 Apr 2024 01:35PM

Photo Stories