Skip to main content

Supreme Court: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రతి చరాస్తినీ వెల్లడించనక్కర్లేదు

election candidates need not disclose every asset they own says supreme court

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు, తన కుటుంబ సభ్యులకు ఉన్న ప్రతి చరాస్తిని వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. చాలా విలువైనవి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబించేవి, తన అభ్యర్థిత్వంపై గణనీయ ప్రభావం చూపించేవి మినహా మిగతా చరాస్తుల విషయంలో గోప్యత పాటించే హక్కు అభ్యర్థికి ఉంటుందని స్పష్టం చేసింది. 

2019లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజూ శాసనసభ నియోజకవర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన కరిఖో క్రి కేసు విషయంలో ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. కరిఖో తన భార్య, కుమారుడికి చెందిన మూడు వాహనాలు, తల్లి పేరిట ఉన్న ప్లాట్‌ వివరాలు వెల్లడించలేదని, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహానికి సంబంధించిన అద్దె, విద్యుత్తు, నీటి, ఫోను బిల్లుల బకాయిలు లేవని చెప్పే ‘నో డ్యూ సర్టిఫికెట్‌’ సమర్పించలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి నూనే తయాంగ్‌గతంలో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. కరిఖో ఎన్నిక చెల్లదని హైకోర్టు గత జూలైలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కరిఖో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థికి సంబంధించిన ప్రతి ఆస్తి గురించి తెలుసుకునే సంపూర్ణ హక్కు ఓటరుకేమీ ఉండదని పేర్కొంది. ఓటర్ల హక్కుగా తన ఆస్తులకు సంబంధించిన వివరాలు అన్నింటినీ కరిఖో క్రి వెల్లడించాల్సిందే అని కాంగ్రెస్‌అభ్యర్థి చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ఎన్నికల కోసమని అభ్యర్థి తన జీవితం మొత్తాన్ని బహిర్గతం చేయాలనే వాదనను తాము సమర్థించడం లేదని పేర్కొంది. ఓటరుకు అవసరం లేదని, అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల పట్ల అభ్యర్థులకు గోప్యత హక్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరిఖో ఎన్నిక చెల్లదని గతంలో గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. తేజూ నియోజక వర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపై స్టే విధించింది. ఎమ్మెల్యేగా కరిఖో అన్ని ప్ర­యోజనాలు పొందొచ్చని, శాసనసభలో బల నిరూపణ పరీక్షలో ఓటేసే హక్కు ఉండదని తెలిపింది.

చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 19 Apr 2024 05:42PM

Photo Stories