Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీరాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం సగర్వంగా కొలువైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలో కల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాం ఇదే. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొన్నారు.
Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్‌రామ్.. సమతావాది.. సంస్కరణవాది..
రూ.146.50 కోట్ల ఖర్చుతో..
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి.
విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్..
విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేడ్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు.
Jallianwala Bagh Massacre: జలియన్ వాలాబాగ్ ఊచకోతకు 104 ఏళ్లు..
36 ఎకరాల్లో స్మృతివనం..
అంబేడ్కర్ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్ వర్క్ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
విగ్రహం, ఇతర ఏర్పాట్ల విస్తీర్ణం ఇలా..
విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం: 11.7 ఎకరాలు
ప్రధాన, అనుబంధ భవనాలు: 1.35 ఎకరాలు
చుట్టూ పచ్చదనం: 2.93 ఎకరాలు
పేవ్‌డ్ ఏరియా: 1.37 ఎకరాలు
చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం: 1.23 ఎకరాలు
కామన్ పార్కింగ్: 4.82 ఎకరాలు
అంబేడ్కర్ విగ్రహం ప్రత్యేకతలివే..
విగ్రహం ఎత్తు: 125 అడుగులు
పీఠం ఎత్తు: 50 అడుగులు
మొత్తం ఎత్తు: 175 అడుగులు
వినియోగించిన స్టీల్: 791 టన్నులు
వినియోగించిన ఇత్తడి: 96 టన్నులు
పనిచేసిన శ్రామికులు: 425 మంది
లిఫ్ట్‌లు: 2 (ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం)
విగ్రహానికి జీవం పోసిన వంజి సుతార్..
హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజి సుతార్. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)’కు రూపమిచ్చింది కూడా ఆయనే. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది.