Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్‌రామ్.. సమతావాది.. సంస్కరణవాది..
సామాజిక, రాజకీయ ఉద్యమాలను ఏక కాలంలో నడిపిన యోధుడు. దళితుల అభ్యున్నతికై పని చేస్తూ వారిని సామాజికంగా బలవంతుల్ని కావించే సాంస్కృతిక ఉద్యమాలూ నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే కలకత్తాలో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటు పడ్డారు. మరోవైపు గాంధీ వంటి మహనీయుల ప్రోద్బలంతో స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ.. తన జాతి జనులు సైతం ఉద్యమంలో పాల్గొనేట్టు ప్రేరేపించారు. దేశ చరిత్రలో ‘బాపూజీ’గా ప్రజలు పిలుచుకున్న నాయకులు ఇద్దరే. అందులో ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్‌రామ్.
ఆయన సామాజిక న్యాయ సాధకుడిగా యోధునిలా పనిచేశారు. తన 28వ ఏటనే బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఎంపికై అణగారిన వర్గాల సమాఖ్య తరఫున వారి గొంతును వినిపించారు. ఈ క్రమంలోనే 1935లో ‘హామండ్ కమిషన్’ ముందు హాజరై మొదటిసారిగా అంటరాని వర్గాలకు ఓటుహక్కు కావాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi disqualified: రాహుల్ గాంధీ అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా..?
విలక్షణ వ్యవహార దక్షత కలిగిన జగ్జీవన్‌రామ్ బిహార్‌లోని కుగ్రామం ‘చాంద్వా’లో 1908, ఏప్రిల్ 5న జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే ‘అఖిలభారత రవిదాస్ మహాసభ’ను ఏర్పాటు చేశారు. గాంధీ ద్వారా ప్రేరణపొంది ఆయన అను యాయిగా అనేక స్వాతంత్య్ర, రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో అత్యంత చురుకైన పాత్రవహించి 1942 ఆగస్టులో అరెస్టయ్యారు. కుల, మత, భాష ప్రాతిపదికన విభజించి పాలించే బ్రిటిష్ వారి పరిపాలన ఎత్తుగడలను ఎండగట్టారు. గాంధీ నెలకొల్పిన ‘అంటరానితనం వ్యతిరేక సమాఖ్య’ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆహ్వానితుడిగా సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మరోవైపు అగ్రవర్ణ హిందువుల్లో మార్పు తీసుకురావడం ద్వారానే సమాజంలో సమానత్వం సిద్ధిస్తుందనీ, తద్వారా అన్ని సామాజిక వర్గాలూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములవుతాయనీ, అదే స్వాతంత్య్ర సిద్ధికి బాటలు వేస్తుందనీ వక్కాణించారు. అణగారిన వర్గాల ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో సంచరించే అవకాశం ఉండాలనీ.. బడి, గుడి, బావులు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే మానవులందరికీ సమాన హక్కులు లభ్యమవుతాయనీ పేర్కొన్నారు. ఇంతటి గొప్ప ఉపన్యాసం చేసిన జగ్జీవన్ ఉపన్యాస పటిమను మెచ్చుకున్న మదన్ మోహన్ మాలవీయ ‘దళిత బంధువులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటే నేను వారి పాదధూళిని నా నుదుటిపై రాసు కుంటాన’ని అన్నారు.
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక విదానం ఎలా ఉంటుందంటే.. ఈ రాష్ట్రాల్లో మాత్రమే..
దళిత వ్యవసాయ కూలీల పిల్లలకు ఉచితవిద్య అందించడం.. హాస్టల్ సౌకర్యం, స్కాలర్ షిప్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే సాధ్య మవుతుందని చెప్పారు. ‘ఖేతిహార్ మజ్‌దూర్ సంఘం’ ద్వారా భూమిలేని కార్మికులకు, వ్యవసాయ కూలీలకు తగు వేతనాలు చెల్లింపునకై ఉద్యమించారు.
రాజ్యాంగ రూపకల్పనలో పలు కమిటీల్లో కీలక భూమిక నిర్వహించారు. ముఖ్యంగా మైనారిటీ హక్కుల సబ్‌కమిటీలోనూ, సలహా కమిటీలోనూ కీలక పాత్ర పోషించారు. తన సోదరుడు, అసమాన ప్రతిభావంతుడు అయిన డా.బీఆర్ అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తన వంతుగా నెహ్రూ, గాంధీ, పటేల్ వంటి మహా మహులను ఒప్పించిన రాజకీయ నేర్పరి జగ్జీవన్‌రామ్.
☛ బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఎంపికయింది మొదలు దాదాపు ఐదు దశాబ్దాలపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు.
☛ దేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధానిగా, మంత్రిగా భారతదేశాభివృద్ధికి పలు విధాల తోడ్పాటు అందించారు.
☛ వ్యవసాయ శాఖమంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాందిపలికి ఆహా రోత్పత్తిని పెంపొందించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తను వెలుగులోకి తెచ్చిన దార్శనికుడు.
☛ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కనీస వేతనాలు చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక చట్టాలను తెచ్చారు.
☛ రెల్వేశాఖ మంత్రిగా రైల్వేలను ఆధునికీకరించి రైల్వే ఛార్జీల భారం పేదవాళ్ళపై పడకుండా సంస్కరణలు చేపట్టారు.
☛ దేశ రక్షణశాఖ మంత్రిగా.. పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో సియాచిన్ పర్వత శ్రేణుల్లో సైనికులతో కలిసి తిరిగారు.
☛ యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి బాటలు వేశారు.
☛ అజాతశత్రువుగా భారత రాజకీయ, సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్‌రామ్ తన 78వ ఏట కన్నుమూశారు.