MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక విదానం ఎలా ఉంటుందంటే.. ఈ రాష్ట్రాల్లో మాత్రమే..
శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి అంటారు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రం.. శాసనసభలో 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాజ్యాంగంలోని అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు, రద్దు చేయవచ్చు. శాసనమండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40కి తగ్గరాదు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 1957లో చట్టం చేసి 1958లో ఏర్పాటు చేశారు. 1985లో రద్దు చేసి 2005లో తిరిగి చట్టం చేసి 2007 నుంచి అమలు చేస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 58 ఎమ్మెల్సీ స్థానాల్లో.. 20 మంది శాసససభ్యులచే ఎన్నుకోబడతారు. స్థానిక సంస్థలకు 20 సీట్లు కేటాయించారు. 5 మందిని పట్టభద్రులు, మరో 5 మందిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. నామినేటెడ్ వర్గంలో ఎనిమిది సీట్లు ఉన్నాయి.
తెలంగాణ శాసన మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రోజు 2014, జూన్ 2న ఏర్పాటైంది.
ప్రస్తుతం దేశంలోని 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. అవి..
1. ఉత్తరప్రదేశ్(100)
2. బీహార్(75)
3. కర్ణాటక(75)
4. మహారాష్ట్ర(78)
5. ఆంధ్రప్రదేశ్(58)
6. తెలంగాణ(40).
పదవీకాలం..
☛ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు.
☛ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒక వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఈ అమరిక భారత పార్లమెంటులోని ఎగువసభ(రాజ్యసభ)ను పోలి ఉంటుంది.
అర్హతలు..
☛ శాసనమండలిలో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.
☛ భారత పౌరుడై ఉండాలి.
☛ మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
☛ దివాళా తీసి ఉండరాదు.
☛ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి.
☛ అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండరాదు.
ఎన్నిక విదానం..
☛ మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగా మ్యునిసిపాలిటీలు, గ్రామ సభలు/గ్రామ పంచాయితీలు, పంచాయత్ సమితులు, జిల్లాపరిషత్‌లు ఎన్నుకుంటాయి.
☛ మూడోవంతు (1/3) మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు.
☛ ఆరోవంతు (1/6) సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. వీరు శాస్త్రసాంకేతిక, కళలు, సామాజిక సేవ, ఇతర రంగాలలో రాణించినవారై ఉంటారు.
☛ పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.
☛ మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
☛ మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు పరోక్షంగా ఎన్నికవుతారు.