Rahul Gandhi disqualified: రాహుల్ గాంధీ అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా..?
2014 నాటి లిల్లీ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు వెంటనే అనర్హతకు గురవుతారని వెల్లడించింది. శిక్ష పడిన మర్నాడే రాహుల్‌పై వేటుకు ఈ తీర్పు దోహదపడినట్లు తెలుస్తోంది. అయితే 2018 నాటి లోక్‌ప్రహరీ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకటించింది. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధిపై అభియోగాలను పై కోరుటు కొట్టేస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. శిక్ష రద్దయితే వేటూ రద్దవుతుందని తెలియజేసింది.
రాహుల్‌పై వేటు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ని లోక్‌సభ సెక్రటేరియట్ ఉదాహరించింది. వీటి ప్రకారం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన సభ్యులపై శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయవచ్చు. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం శిక్ష పడిన 3 నెలల తర్వాత మాత్రమే అనర్హత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఈలోగా శిక్షపడిన సభ్యుడు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. కింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. కానీ, రాహుల్‌పై వెంటనే వేటు వేయడం గమనార్హం.
ఇలా శిక్ష పడిన మరుసటి రోజే సభ్యులపై అనర్హత వేటు వేసిన దాఖలాలు గతంలో లేవు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(4)ను లోక్‌సభ సెక్రటేరియట్ పట్టించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. లోక్‌ప్రహరీ కేసు ప్రకారం.. రాహుల్‌కు పడిన జైలుశిక్షను పై కోర్టు రద్దు చేస్తే ఆయనపై అనర్హత వేటు సైతం రద్దవుతుంది.
Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. రాహుల్‌పై ఉన్న కేసు ఏమిటీ?
అనర్హత వేటు పడ్డ నేతలు..!
ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడితే చట్టసభ సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. మోదీ ఇంటి పేరుని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు శిక్ష విధించడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో గతంలో ఎవరెవరకి శిక్ష పడి ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్ని పోగొట్టుకున్నారో చూద్దాం.
లాలూ ప్రసాద్ యాదవ్: దాణా కుంభకోణం కేసులో సెప్టెంబర్ 2013లో దోషిగా తేలిన ఆర్‌జేడీ అధినేత పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. బిహార్‌లోని సారన్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన పదవి పోగొట్టుకొని జైలు పాలయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
జె.జయలలిత: ఏఐఏడీఎంకే దివంగత నాయకురాలు జె.జయలలిత కూడా జైలు శిక్ష పడిన కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో తమిళనాడు అసెంబ్లీ సెప్టెంబర్ 2014లో ఆమె శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2015లో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె తిరిగి సీఎం పదవి దక్కించుకున్నారు.
Amritpal Singh: అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేదెవరు.. వారి పూర్తి వివరాలివే..!
పి.పి. మహమ్మద్ ఫైజల్: హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ పి.పి.మహమ్మద్ ఫైజల్‌కు పదేళ్లు జైలు శిక్ష పడడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అనంతరం జైలుశిక్షపై స్టే నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సి ఉంది.
ఆజమ్‌ఖాన్: విద్వేషపూరిత ప్రసంగాల కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజమ్‌ఖాన్‌పై 2022 అక్టోబర్‌లో ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.
అనిల్ కుమార్ సాహ్ని: రాజ్యసభ ఎంపీగా ఉండగా విమాన ప్రయాణాలు చేయకుండానే తప్పుడు టిక్కెట్లు సమర్పించి రూ.23.71 లక్షలు క్లెయిమ్ చేసుకున్న కేసులో బీహార్‌కు చెందిన అనిల్ కుమార్ సాహ్నికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష పడిన సమయంలో అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
విక్రమ్ సింగ్ సైని: 2013 నాటి ముజాఫర్‌నగర్ ఘర్షణల కేసులో దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైని 2022 అక్టోబర్‌లో అనర్హతని ఎదుర్కొన్నారు.
ప్రదీప్ చౌధరి: హర్యానాలోని కాల్కా నియోజవకర్గం ఎమ్మెల్యే ప్రదీప్ చౌధరికి దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2021జనవరిలో హర్యానా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు పడింది.
కులదీప్ సింగ్ సెంగార్: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2020 ఫిబ్రవరిలో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
అబ్దుల్లా ఆజమ్‌ఖాన్: 15 ఏళ్ల క్రితం నాటి ధర్నా కేసులో రెండేళ్ల పాటు శిక్ష పడిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజమ్ ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.
అనంత్ సింగ్: బీహార్‌లోని ఆర్‌జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ నివాసంలో మారణాయుధాలు లభ్యమైన కేసులో ఆయన దోషిగా తేలడంతో 2022 జులైలో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.