Skip to main content

Amritpal Singh: అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేదెవ‌రు.. వారి పూర్తి వివ‌రాలివే..!

దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేసే అమృత్‌పాల్‌ సింగ్‌ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి.
Gurmeet Singh Bukkanwala, Daljeet Singh Kalsi, Bhagwant Singh and Basant Singh Daulatpura
Gurmeet Singh Bukkanwala, Daljeet Singh Kalsi, Bhagwant Singh and Basant Singh Daulatpura

దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్‌ఐ అమృత్‌పాల్‌ను దుబాయ్‌ నుంచి పంజాబ్‌కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్‌కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్‌పాల్‌ సింగ్‌ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్‌పాల్‌ భారత్‌కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం ఉంది.  

Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ విదేశీ నిధులపై ఆరా.. భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ను ప్రశ్నించిన పోలీసులు!

ఎజెండా ఇదీ..
☛ పంజాబ్‌ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.  
☛ విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్‌ యువతలో గన్‌ కల్చర్‌ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. 
☛ పంజాబ్‌లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్‌ ఖల్సా ఫౌజ్‌ (ఏకేఎఫ్‌) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్‌ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు.  
☛ డ్రగ్స్‌కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్‌ నుంచి వచ్చాక జల్లూపూర్‌ కెహ్రా గ్రామంలో డ్రగ్‌ డీ–ఎడిక్షన్‌ సెంటర్‌ని నెలకొల్పాడు. 
☛ డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ సెంటర్‌కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్‌ పంజాబ్‌ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది.  

అమృత్‌పాల్‌పైనున్న కేసులు  
వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ మొత్తం ఆరు క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి.  
ఫిబ్రవరి 16 : అమృత్‌పాల్‌పై కిడ్నాప్, దాడి కేసు నమోదు 
ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు 
ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు 
ఫిబ్రవరి 23 – అమృత్‌పాల్, అతని సాయుధ అనుచరులు
పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు  
మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు 
మార్చి 19 : ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసినందుకు జలంధర్‌లో కేసు  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

అమృత్‌పాల్ వెంట ఉన్న‌ ఆ ఏడుగురు వీరే.. వారి వివ‌రాలు 

పపల్‌ప్రీత్‌ సింగ్‌ 
అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకే పపల్‌ప్రీత్‌ సింగ్‌ అమృత్‌సింగ్‌ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్‌ప్రీత్‌ సింగ్‌ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్‌పాల్‌ బైక్‌పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్‌ప్రీత్‌గా పోలీసులు గుర్తించారు. ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్‌ప్రీత్‌ సింగ్‌ పంజాబ్‌లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్‌ డిమాండ్‌తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్‌ప్రీత్‌ సింగ్‌ సూచనల మేరకే అమృత్‌పాల్‌ సింగ్‌ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు.  

భగవంత్‌ సింగ్‌ 
అమృత్‌పాల్‌ సింగ్‌కు కుడిభుజం. పంజాబ్‌లో అజ్నాలా పోలీసు స్టేషన్‌లో హింసాకాండకు భగవంత్‌ సింగ్‌ బాధ్యుడు. అమృత్‌పాల్‌ సింగ్‌కు మీడియా, సోషల్‌ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్‌సింగ్‌ పరారయ్యాక భగవంత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు అతను సోషల్‌ మీడియా లైవ్‌లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్‌ అన్నీ బ్లాక్‌ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్‌ జైలులో ఉన్నాడు.  

కిరణ్‌దీప్‌ కౌర్‌ 
అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య. బ్రిటన్‌కు చెందిన ఎన్నారై. రివర్స్‌ మైగ్రేషన్‌ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్‌ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్‌ తీసుకురావడానికే ఈమెను అమృత్‌పాల్‌ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అమృత్‌పాల్‌కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు.  

దల్జీత్‌ సింగ్‌ కల్సి 
అమృత్‌సర్‌కు చెందిన దల్జీత్‌ సింగ్‌ కల్సి అమృత్‌పాల్‌కు ఫైనాన్షియర్‌. పాకిస్థాన్‌ నిఘా ఏజెన్సీ ఐఎస్‌ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్‌ఐకి అమృత్‌పాల్‌కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

గుర్మీత్‌ సింగ్‌ 
అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్‌ సింగ్‌. పోలీసులు అమృత్‌సింగ్‌పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్‌సర్‌ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్‌ సింగ్‌ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్‌ కూడా దిబ్రూగఢ్‌ జైల్లోనే ఉన్నాడు. 

లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ సింగ్‌ 
వారిస్‌ పంజాబ్‌ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్‌పాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. లవ్‌ప్రీత్‌ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్‌పాల్‌ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాడు. 

హర్‌జీత్‌ సింగ్‌  
అమృత్‌పాల్‌ సింగ్‌కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్‌జీత్‌ సింగ్‌ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్‌జీత్‌ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్‌జీత్‌ సింగ్‌ దుబాయ్‌లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్‌పాల్‌ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్‌జీత్‌ భారత్‌కు తిరిగి వచ్చాడు. అమృత్‌పాల్‌ దుబాయ్‌ నుంచి పంజాబ్‌కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్‌జీత్‌ ప్రభావం అధికంగా ఉంది.  

Published date : 24 Mar 2023 05:52PM

Photo Stories