Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. రాహుల్‌పై ఉన్న కేసు ఏమిటీ?
ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ కోర్టులోనే ఉన్నారు. ‘‘ఈ కేసులో దోషి పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినా అది దేశ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేసు తీవ్రత పెరిగింది.
దోషికి తక్కువ శిక్ష విధిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లు అవుతుంది. ఎవరైనా ఇతరులను ఇష్టారాజ్యంగా దూషించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో రాహుల్ గతంలో క్షమాపణ చెప్పారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు’’ అని న్యాయస్థానంలో తన తీర్పులో పేర్కొంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
కించపర్చే ఉద్దేశం లేదు..
విచారణ సందర్భంగా రాహుల్ తన వాదన వినిపించారు. తనకు ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదని, దేశ ప్రజలందరినీ అభిమానిస్తానని చెప్పారు. ఎవరినీ కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ‘‘ప్రజాప్రయోజనాల కోణంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించా. అది నా విధి’’ అని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నిందితుడు గతంలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, ఎవరి నుంచీ క్షమాభిక్ష కోరలేదని, ఆయనకు తక్కువ శిక్ష విధించాలని రాహుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఖండించారు. రాహుల్‌ను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
అనర్హత వేటు పడుతుందా?
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన రాజకీయ నాయకుడిపై శిక్ష ఖరారైన తేదీ నుంచి మిగిలిన పదవీ కాలమంతా అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడు. అయితే, అనర్హత వేటు వెంటనే పడదని సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జెఠ్మలానీ చెప్పారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం మూడు నెలల గడువు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సమయంలో నేరారోపణ లేదా శిక్షపై అప్పిలేట్ కోర్టు స్టే ఇస్తే అప్పీల్‌పై విచారణ ముగిసే దాకా అనర్హత వేటు కూడా ఆగిపోతుందని వివరించారు. మూడు నెలల్లోగా నేరారోపణ లేదా శిక్ష రద్దు కాకపోతే దోషిపై అనర్హత వేటు వేయొచ్చని పేర్కొన్నారు. శిక్షను రద్దు చేసే అధికారం శిక్ష విధించిన కోర్టుకు కాకుండా అప్పిలేట్ కోర్టుకే ఉంటుందన్నారు.
రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయొచ్చని, అదే జరిగితే అప్పీల్‌పై విచారణ ముగిసేదాకా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని మహేష్ జెఠ్మలానీ వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయడమో లేదంటే నేరారోపణపై స్టే విధించడమో జరగాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది చెప్పారు. రాహుల్ గాంధీకి అప్పిలేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. 2013 నాటి లిలీ థామస్, 2018 నాటి లోక్ ప్రహరి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధుల శిక్ష రద్దయితే అనర్హత వేటు కూడా రద్దవుతుందని అప్పట్లో న్యాయస్థానం తేల్పిచెప్పిందని వివరించారు.
ITU Area Office: ఐటీయూ ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
ఏమిటీ కేసు?
2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ‘దొంగలందరి ఇంటి పేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అని అన్నారు. మోదీ సామాజికవర్గం పరువుకు రాహుల్ నష్టం కలిగించారంటూ గుజరాత్‌లోని సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణ సూరత్‌లో జరగకుండా విధించిన స్టేను గుజరాత్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తొలగించింది.