Skip to main content

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?

కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ.. ఆ మహమ్మారి మళ్లీ జడలు విప్పనుందా? అనే ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. ఒమిక్రాన్‌ బీఎఫ్‌– 7 సబ్‌ వేరియంట్‌ పాజిటివ్‌ కేసులు గుజరాత్, ఒడిశాల్లో నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

BF.7 : కరోనా కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’.. ఈ వైరస్‌ సోకితే ఎలా గుర్తించాలంటే..?

➤ రాష్ట్రంలో ఈ కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవచ్చనే అవగాహన ప్రజల్లో కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖలు సన్నద్ధమవుతున్నాయి. బూస్టర్‌ డోస్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెబుతున్నాయి. కొత్త వేరియంట్‌ బీఎఫ్‌– 7ను.. బీ అంటే బీకేర్‌ఫుల్‌.. ఎఫ్‌ అంటే ఫాస్ట్‌గా వ్యాపించేది అనే అర్థంతో సరిపోల్చుతున్నాయి. బీఎఫ్‌ వేరియంట్‌ ప్రభావం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు ఇలా వివరించారు. 
➤ రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిపై  బీఎఫ్‌– 7 వేరియంట్‌  ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు, రుగ్మతలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.   
➤ చిన్నారుల్లో ఎక్కువగా ఉన్న  ఇమ్యూనిటీ పవర్‌ (రోగ నిరోధకశక్తి ) శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లను అడ్డుకుని వాటిని నాశనం చేస్తుంది. నిలోఫర్‌ ఆస్పత్రిలో  ఇటీవల జరిపిన సర్వేలో చిన్నారుల్లో యాంటీబాడీస్‌ పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయిదేళ్ల లోపు చిన్నారులకు మాస్క్‌ వినియోగించకూడదు. మాస్క్‌ వలన ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గే అవకాశం ఉంది.   
➤ పోస్ట్‌ కోవిడ్‌ రుగ్మతలైన బ్లాక్‌ఫంగస్, పక్షవాతం, అవయవాలు సరిగా పని చేయకపోవడం వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుల సలహా మేరకే  యాంటీబయోటిక్‌ మందులు వాడాలి. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం, హ్యాండ్‌ శానిటైజేషన్‌ వంటి కోవిడ్‌ నిబంధనలు, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొవచ్చు.   

బీఎఫ్‌– 7 వైరస్‌ లక్షణాలు ఇవే.. 
ఒమిక్రాన్‌ బీఎఫ్‌– 7 సబ్‌ వేరియంట్‌ లక్షణా లను వైద్య నిపుణులు స్పష్టం చేశారు. జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, కాళ్లు, చేతులు గుంజడం, తలనొప్పి, నీరసం, డీహైడ్రేషన్, ఆ యాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.  

గ్రేటర్‌లో బూస్టర్‌ డోస్‌ డౌన్‌ఫాల్‌..   
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం. మూడు జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 2.11 కోట్ల మంది కోవిడ్‌ వ్యా క్సిన్‌ తీసుకున్నారు. వీరిలో 99.2 లక్షల మంది ఫస్ట్‌డోస్, 89.4 లక్షల మంది సెకండ్‌ డోస్‌ తీసుకోగా, కేవలం 23 లక్షల మంది మాత్రమే బూస్టర్‌డోస్‌ తీసుకోవడం గమనార్హం. 

బూస్టర్‌డోస్‌ తప్పనిసరి..
వ్యాక్సిన్‌ ప్రభావం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది, రెండో డోస్‌ తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. రోజులు పెరుగుతున్న కొద్ది వ్యాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది. శరీరంలోని యాంటిబాడీస్‌ ప్రొటెక్ట్‌ చేయకపోవడంతో వైరస్‌ ప్రవేశిస్తుంది. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.  
                                                        –రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌  

చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి..
తొంభై శాతం చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధకశక్తి ఉంది. మొదటి మూడు వేవ్స్‌లో డెల్టా, ఒమిక్రాన్‌ వైరస్‌లు చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయిదేళ్లలోపు చిన్నారులకు ఫీవర్‌కు పారాసిటమాల్, కోల్డ్‌కు నాజిల్‌ డ్రాప్స్, అయిదేళ్లు దాటితే కాఫ్‌ సిరప్‌లు ఇవ్వవచ్చు. పుట్టుకతోనే పలు రకాల రుగ్మతలున్న చిన్నారుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.  
                   – ఉషారాణి, నిలోఫర్‌ సూపరింటెండెంట్‌

Published date : 23 Dec 2022 08:21PM

Photo Stories