BF.7 : కరోనా కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’.. ఈ వైరస్ సోకితే ఎలా గుర్తించాలంటే..?
ప్రస్తుతం కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌గా ఉన్నప్పటికీ చైనా పరిస్థితులను చూస్తే ఈ కొత్త వేరియంట్ అంశం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ బీఎఫ్.7 లక్షణాలేంటి? ఆ వైరస్ సోకితే ఎలా గుర్తించాలి?
► భారత్‌లో కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నాలుగు వెలుగుచూశాయి. గుజరాత్‌లో మూడు, ఒడిశాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు.
☛ బీఎఫ్.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఛాతి పైభాగం, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
☛ జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
☛ కొంత మందిలో పొట్ట సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. వాంతులు, విరేఛనాల వంటివి కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
☛ బీఎఫ్.7 వేరియంట్ విషయంలో తీవ్రంగా అనారోగ్యానికి గురుకావటం అనేది జరగటం లేదు. లక్షణాలు లేకుండానే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ నుంచి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
☛ కొత్త వేరియంట్ బీఎఫ్.7ను చైనా, భారత్‌తో పాటు అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ గుర్తించారు. చైనా మినహా ఇతర దేశాల్లో ఈ వేరియంట్ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం ఊరటనిస్తోంది.