Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 19, 2023 కరెంట్ అఫైర్స్
Apple Store: భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సీఈవో టిమ్ కుక్..
అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తమ తొలి రిటైల్ స్టోర్‌ను ఏప్రిల్ 18న ఆవిష్కరించింది. ముంబై బీకేసీ(బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో దీన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ స్టోర్‌ను యాపిల్ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. 20,800 చదరపు అడుగులు ఉన్న ఈ స్టోర్‌కు నెలకు రూ.42 లక్షల వరకు(ఏడాదికి రూ.5.04 కోట్లు) అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంది. ఇక ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అద్దె 15 శాతం చొప్పున పెరుగుతుంది. కాగా మొత్తం 3 ఫ్లోర్లను యాపిల్ తన స్టోర్ కోసం తీసుకుంది.
ఈ సందర్భంగా టిమ్ కుక్ ‘భారత్‌లో మా తొలి స్టోర్ యాపిల్ బీకేసీని ప్రారంభించడం ఆనందంగా ఉంది‘ అని ట్వీట్ చేశారు. యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్) డియెర్‌డ్రె ఓ బ్రియెన్‌తో కలిసి కస్టమర్లను స్వయంగా ఆహ్వానించారు. యాపిల్ రెండో స్టోర్‌ను ఏప్రిల్ 20 న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు.
GST New Rule: మే 1 నుంచి జీఎస్టీ కొత్త రూల్.. ఇకపై అలా కుదరదు!
Digital Payments: డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు టాప్
దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2022లో 65 బిలియన్ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం న్యూఢిల్లీ (1.96 కోట్ల లావాదేవీలు, 50 బిలియన్ డాలర్ల విలువ), ముంబై (1.87 కోట్ల లావాదేవీలు, 49.5 బిలియన్ డాలర్ల విలువ), చెన్నై (1.43 కోట్ల లావాదేవీలు, 35.5 బిలియన్ డాలర్ల విలువ), పూణే (1.5 కోట్ల లావాదేవీలు, 32.8 బిలియన్ డాలర్ల విలువ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అద్భుతమైన పురోగతి నమోదవుతోందని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు. దేశీయంగా నగదు చలామణీని తగ్గించే దిశగా చెల్లింపులకు సంబంధించి బహుళ సాధనాలు అందుబాటులోకి రావడం మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
UPI Payments: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. కానీ వారికి మాత్రం..
Archery World Cup: డిప్యూటీ కలెక్టర్, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న భారత అగ్రశ్రేణి ఆర్చర్ (ఆంధ్రప్రదేశ్ అమ్మాయి) వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్‌లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఏప్రిల్ 18న జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
FIFA Rankings: ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అర్జెంటీనా
Abdul Azeem: హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
దేశవాళీ క్రికెట్‌లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ ఏప్రిల్ 18న కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (12-18 మార్చి 2023)
World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day)గా జరుపుకుంటున్నాం. లివర్ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కాలేయ వ్యాధుల తీవ్రత, ముందస్తుగా గుర్తించడం, నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు.
2023 వరల్డ్ లివర్ డే థీమ్ "అప్రమత్తంగా ఉండండి, రెగ్యులర్ లివర్ చెక్ అప్ చేయించుకోండి. ఫ్యాటీ లివర్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది(Be Vigilant, Do Regular Liver Check-Up, Fatty Liver Can Affect Anyone)". ఊబకాయం (అధిక బరువు), ఇన్సులిన్ నిరోధకత (మధుమేహం), ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి కారకాలతో లివర్ వ్యాధులు సంభవిస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ లివర్ చెక్ అప్‌ల అంశాన్ని ఈ సంవత్సరం నొక్కి చెప్పడంపై థీమ్ దృష్టి సారిస్తుంది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం..
Mulapeta Port: మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు.
విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది.
Aquarium In Hyderabad: హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ ఆక్వేరియం..!
మరికొన్ని ప్రాజెక్టులకు శ్రీకారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా ఏప్రిల్ 19న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. కాగా సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి.
మూలపేట పోర్టు విశేషాలు
☛ పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్ టన్నులు
☛ బెర్తుల సంఖ్య 4
☛ ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి
☛ నౌపడ జంక్షన్ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం
☛ గొట్టా బ్యారేజ్ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా
☛ పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు
Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
TruthGPT: త్వరలో ‘చాట్‌జీపీటీ’కి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’.. ఎలాన్ మస్క్ ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాటింగ్ టెక్నాలజీ పెరిగిపోతుండడం పట్ల ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’ పేరిట సొంత చాట్‌బాట్ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు.
Sundar Pichai: కృత్రిమ మేధను తలచుకుంటే నిద్రలేని రాత్రులే.. సుందర్ పిచాయ్
Same-Sex Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అత్యంత సంక్లిష్టం
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అత్యంత సంక్లిష్టమైన అంశమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. వాటికి కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 18న విచారణ మొదలు పెట్టింది. ‘ఈ విషయంలో వ్యక్తిగత వివాహ చట్టాల్లోకి పోదల్చుకోలేదు. కులమతాలతో సంబంధం లేకుండా భిన్న మతాలు, కులాలకు చెందిన వారు పెళ్లి చేసుకునేందుకు చట్టపరమైన వెసులుబాటు కల్పిస్తున్న ప్రత్యేక వివాహ చట్టంపై మాత్రమే విచారణ జరుపుతాం. దానిమీదే వాదనలు విన్పించండి’ అని న్యాయవాదులకు సూచించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణను వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
Same-Sex Marriage: స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు దోషులకు ఏ ప్రాతిపదికన శిక్ష తగ్గించారు.. కేంద్రం, గుజరాత్ సర్కారుకు సుప్రీం ప్రశ్న?
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? శిక్ష తగ్గించే ముందు నేర తీవ్రత దృష్ట్యా కాస్త బుర్ర ఉపయోగించి ఉండాల్సింది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేర తీవ్రతను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ నిలదీసింది. ‘ఓ గర్భిణిపై అతి హేయంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబీకులెందరినో దారుణంగా హత్య చేశారు. ఈ రోజు బానో బాధితురాలు. రేపు ఇంకెవరైనా కావచ్చు. మీరు, నేను కూడా కావచ్చు!’ అని కేంద్రాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్న ధర్మాసనం ఏప్రిల్ 18న విచారించింది. దోషులకు ఇష్టమొచ్చినట్టు పెరోల్ మంజూరు చేశారంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘ఒకరికి ఏకంగా 1,000 రోజుల పెరోల్ ఇచ్చారు. అంటే మూడేళ్లు. మరొకరికి 1,200 రోజులు, ఇంకొకరికి 1,500 రోజులిచ్చారు! అసలు మీరు ఏ విధానాన్ని అనసరిస్తున్నారు?’ అంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘ఇది కేవలం ఓ సాధారణ హత్య కేసు కాదు. హత్యలు, పైపెచ్చు సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసు. ఓ జనహననాన్ని మామూలు హత్యలా చూడలేం’ అంటూ తలంటింది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (12-18 మార్చి 2023)
UN Population Report: జనాభాలో మనమే ఫస్ట్.. జనాభాలో చైనాను దాటేసిన భారత్!
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది. తాజాగా ఐక్యరాజ్యసమితి చెందిన సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిను యూఎన్ అధికారులు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం చైనా కంటే ఇండియాలో 29 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, చైనా జనాభా 142.57 కోట్లతో రెండో స్థానంలో ఉంది. యూఎస్ఏ 340 మిలియన్ల జనాభాతో మూడో స్థానంలో ఉన్నట్లు యుఎన్ అంచనా వేసింది. 2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ నివేదిక వెల్లడించినట్లు ఐక్యారాజ్యసమతి జనాభా విభాగం స్పష్టం చేసింది.
కాగా భారత్ చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టింది. 2021లో జరగాల్సిన జన గణన కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు వాటా భారత్, చైనాదే ఉందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది.