Same-Sex Marriage: స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
ఆడ, మగ మధ్య జరిగే వివాహాలకు మాత్రమే వ్యవస్థ నుంచి గుర్తింపు లభిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా స్వలింగ వివాహాలను గుర్తించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీల మధ్య జరిగే పెళ్లిళ్లను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల విచారణార్హతను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. వివాహాలకు చట్టబద్ధత కల్పించడం అనేది చట్టసభలకు సంబంధించిన వ్యవహారమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ అంశాన్ని చట్టసభలకే వదిలేయాలని, న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని కోరారు.
AIIMS: ఎయిమ్స్–గువాహటి జాతికి అంకితం
స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా? లేదా? అనేది చట్టసభలే నిర్ణయిస్తాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం అనేది వ్యక్తిగత చట్టాలు, సామాజిక ఆమోదం పొందిన విలువల మధ్య ఉన్న సున్నితమైన సమతూకాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 18న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది.