Skip to main content

Jagananna Arogya Suraksha: 30 లక్షల మందికి సేవల దిశగా ఆరోగ్య సురక్ష–2

Jagananna Arogya Suraksha   Jagananna Arogya Suraksha  Program Phase 2
Jagananna Arogya Suraksha

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్‌)’ కార్యక్రమం రాష్ట్రవ్యా­ప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం (జేఏఎస్‌–2) కొన­సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభ­మైన రెండో దశ కార్యక్రమంలో నిర్దేశిత షెడ్యూల్‌ మేరకు గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్‌ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది.

ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. 

ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి సేవలు
జేఏఎస్‌ –2 లో రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 నిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటివరకూ వైద్య సేవలందించారు.  అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్‌ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు.

వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్‌సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్‌ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్‌ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్‌ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్‌ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌లు పనిచేస్తున్నారు.  
 

Published date : 18 Mar 2024 01:14PM

Photo Stories