Skip to main content

Success Story: రోజుకు 18 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డ్డాం.. చివ‌రికి అప్పుల‌న్నీ తీర్చి గ‌ట్టెక్కాం.. ఆలూరి లలిత స‌క్సెస్ స్టోరీ ఇదే...

మహిళల పురోగతికి ఆకాశమే హద్దు. నిజమే... మరి! మహిళ పురోగతి ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆకాంక్ష నుంచి మొదలు కావచ్చు... అలాగే... ఒక అవసరం నుంచి కూడా మొదలు కావచ్చు. అవును... అవసరమే ఆమెను జాతీయస్థాయిలో నిలిపింది. ఆమె... మహిళలకు చేయూతనిచ్చే స్థానంలో నిలిచింది.
Aluri-Lalitha
Aluri-Lalitha

ఆలూరి లలిత మహిళాపారిశ్రామికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేశారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టారు. ఉమ్మడి కుటుంబం కూడా కావడంతో తన మీద పెద్ద బాధ్యతలేవీ లేవు. నాలుగేళ్లు అలా గడిచిపోయాయి.

తమ కంపెనీ ఒడిదొడుకుల్లో ఉందని, భాగస్వాములు దూరం జరిగారని తెలిసిన తర్వాత భర్తకు తోడుగా బాధ్యత పంచుకోవడానికి భుజాన్నివ్వాల్సి వచ్చింది. అలా మొదలైన పారిశ్రామిక ప్రస్థానం ఆమెను విజేతగా నిలపడంతోపాటు జాతీయ స్థాయిలో సంఘటితమైన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె)కు అధ్యక్షురాలిని చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు లలిత.

చ‌ద‌వండి: ఒక వైపు తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు కుటుంబంపై నింద‌లు.. ఈ క‌సితోనే చ‌దివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..
 
‘అవసరం’తో పోరాటం
‘‘గృహిణిగా ఉన్న నేను పరిశ్రమ నిర్వహణలోకి అడుగుపెట్టింది 1998లో. అప్పటికే మనుగడ సమస్య మాది. తీరా అడుగు పెట్టిన తర్వాత తెలిసింది బ్యాంకు వాళ్లు మా పరిశ్రమను ఎన్‌పీఏ (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌) కేటగిరీలో లిస్ట్‌ చేశారని. మూడు క్వార్టర్లు బకాయి పడి ఉన్నాం. మరో క్వార్టర్‌ సమయం కావాలని అడిగాను. మొదట్లో ససేమిరా అన్నారు.

‘మీరు హ్యాండోవర్‌ చేసుకుని మీ డబ్బు ఎలా జమ చేసుకుంటార’ని అడిగాను. మెషినరీ అమ్మేస్తామన్నారు. ఈ మెషీన్‌లతో పని చేయడానికి మా వారు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని వచ్చారు, హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు. మీరు స్క్రాప్‌ కింద అమ్మాల్సిందే, రెండు లక్షలు కూడా రావు.

మాకు టైమిస్తే మీ లోన్‌ మొత్తం తీర్చేస్తామని చెప్పాను. ఆ తర్వాత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల సహాయంతో పది లక్షలు ఎదురు పెట్టి కొత్త టెక్నాలజీతో పరిశ్రమను నడిపించాం. రెండేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేశాం. మొత్తానికి గట్టెక్కాం.

2005లో పరిశ్రమ విస్తరించాలనే ఆలోచనతో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ – జేఎన్‌టీయూ తో కలిసి నిర్వహించిన ఎంప్లాయ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ సంస్థలో భాగస్వామినయ్యాను. లైఫ్‌ మెంబర్, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్, తెలంగాణ చాప్టర్‌ ప్రెసిడెంట్, జాతీయ స్థాయి కమిటీలో జాయింట్‌ సెక్రటరీ, సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టాను.

Success Story: 5 వేలు పెట్టుబడితో 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం... సామాన్యుడికి స్ఫూర్తినింపే ఈ వ్య‌క్తి గురించి మీకు తెలుసా..?
 
ఈ రాష్ట్రాలు ముందున్నాయి!
మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు కొన్ని రాష్ట్రాలు చేయి పట్టి నడిపించాల్సిన దశలోనే ఉన్నాయి. మా సంస్థలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే. ఐఐటీ, బిట్స్, ఐఐఎమ్‌ స్టూడెంట్స్‌ ఉన్నారు.

వాళ్లు ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మా చదువు, పరిశ్రమ నిర్వహణలో మేము నేర్చుకున్న మెళకువలతో కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చిన వాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాగే కాలేజ్‌లకెళ్లి విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించడం, నగరాల్లోని అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లోనూ, గ్రామాల్లోనూ మహిళలకు శిక్షణతోపాటు ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
 
మహిళలు మారారు!
మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేసుకుంటే చాలన్నట్లు, భర్త సంపాదనకు తోడు మరికొంత అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. తన ఐడెంటిటీని తామే రాసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అలాగే విజయవంతం అవుతున్నారు. ఉద్యోగం చేసి పిల్లల కారణంగా కెరీర్‌లో విరామం వచ్చిన మహిళలకు (35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి) వారి సామర్థ్యం, ఆసక్తిని బట్టి ‘రీ ఇగ్నైట్‌’ ప్రోగ్రామ్‌ కింద సపోర్ట్‌ చేస్తున్నాం. పదివేల మంది విద్యార్థులను, 30 వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత దిశలో నడిపించాలనేది ప్రస్తుతం మా కోవె ముందున్న లక్ష్యం’’.

Success Story: సొంత ప్రిపరేషన్‌తో రైల్వే టీసీగా ఎంపికైన రైతు బిడ్డ

ఇలా చేయండి....
ఒక మహిళ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టినప్పుడు అది నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు దాదాపుగా మూడు నాలుగేళ్లు జీవితం మనది కాదు మన పరిశ్రమది అనుకుని శ్రమించాలి. మార్కెట్‌ని విశ్లేషించుకోవాలి. రెవెన్యూ మీద అవగాహన ఉండాలి. పెట్టుబడి, రాబడి మాత్రమే కాదు. రాబడికి ఆదాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి.  

కౌంటర్‌లోకి వచ్చిన ప్రతిరూపాయి మనది కాదు. ఉద్యోగుల వేతనాలు, అద్దె, కరెంటు, పెట్టుబడి కోసం మనం ఇంటి నుంచి పెట్టిన డబ్బుకు కొంత జమ వేసుకోవడం, బ్యాంకు లేదా ఇతర అప్పులు అన్నీ పోగా మిగిలినదే ఆదాయం. అదే మనం సంపాదించినది, మన కోసం ఖర్చు చేసుకోగలిగినది.  
పరిశ్రమ కోసం ఒక మూలనిధి ఏర్పాటు చేసి ఏటా పదిశాతం లాభాలను మూలనిధిలో జమ చేయాలి. యంత్రాల రిపేరు వంటి అనుకోని ఖర్చులకు, పరిశ్రమ విస్తరణకు ఆ నిధి పనికొస్తుంది. కోవిడ్‌ దెబ్బకు తట్టుకుని నిలబడినవన్నీ మూలనిధి ఉన్న పరిశ్రమలే.
మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... పరిశ్రమ నిర్వహణ బరువైనప్పుడు అది లాభాల బాట పట్టడం కష్టం అని నిర్ధారించుకున్నప్పుడు దాని నుంచి వెంటనే మరొక దానికి మారిపోవాలి.  
మొదట్లో కష్టపడినన్ని గంటలు పదేళ్లు, పాతికేళ్లు కష్టపడలేరు. కాబట్టి ఇంట్లోనూ, పరిశ్రమలోనూ సపోర్టు సిస్టమ్‌ని అభివృద్ధి చేసుకోవాలి.

Published date : 05 May 2023 01:52PM

Photo Stories