Inspiring Success Story : నైట్ వాచ్‌మెన్.. బంట్రోత్.. ఇప్పుడు ఏకంగా ప్రొఫెసర్ ఉద్యోగం.. ఎలా అంటే..?
ఇంటి నిండా కష్టాలే.. కానీ..
కమల్ సార్ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. అందులో ఏ ఒక్కటీ ఆయనకు అనుకూలంగా అనిపించదు. పేదరికం, సరైన వసతులు కూడా లేని ఇల్లు, తల్లి అనారోగ్యం కోసం ఖర్చు.. ఇంటి నిండా పుట్టెడు కష్టాలే. అయినా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అద్భుతమైన సంకల్ప శక్తిని ప్రదర్శించారు. అందుకేనేమో ఇరుకుగల్లీలో రంగులు వెలిసిపోయిన ఆయన రెండు గదుల ఇంటికి అభినందల కోసం ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు.
Inspirational Success Story : వీళ్ల నోళ్లు మూయించి.. ఉన్నత ఉద్యోగం కొట్టాడిలా.. చివరికి..
కుటుంబ నేపథ్యం :
కమల్ కిశోర్ మండల్(42) .. ఉండేది బీహార్ భగల్‌పూర్ ముండీచాక్ ప్రాంతం. చాలా పేద కుటుంబం ఆయనది. కమల్ తండ్రి గోపాల్ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు(ఇప్పటికీ).
ఎడ్యుకేషన్ :
డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్‌షిప్ మీద నెట్టుకొచ్చారు కమల్. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీతోనే 23 ఏళ్లకు చదువు ఆపేశారు. చదివింది పొలిటికల్ సైన్స్ అయినా.. కుటుంబ పోషణ కోసం 2003లో ముంగర్‌లో ఉండే ఆర్డీ అండ్ డీజే కాలేజీ నైట్ వాచ్‌మెన్‌గా చేరాడు.
Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..
ఇదే ఈయన జీవితంలో కీలక మలుపు..
అదృష్టంకొద్దీ నెల తర్వాత డిప్యుటేషన్ మీద తిల్కా మాంజీ భగల్‌పూర్ యూనివర్సిటీకి ప్యూన్‌గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్‌కు ప్యూన్‌గా పని చేశాడు. అది ఆయన జీవితాన్ని పెను మలుపు తిప్పింది. స్టాఫ్‌కు చాయ్‌లు, టిఫిన్‌లు, పేపర్లు అందించిన కమల్‌కి.. అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులను చూసిన కిశోర్‌కు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సంబంధిత విభాగానికి ఆయన అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అనుమతి దొరికింది. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నాం నుంచి బంట్రోతు పని.. రాత్రిళ్లు చదువు.. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది.
ఇదే ఊపుతో..
మొత్తానికి ఎంఏ(అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్)ను 2009లో పూర్తి చేశారు. ఆ వెంటనే పీజీ కోసం డిపార్ట్‌మెంట్‌లో అనుమతి కోరగా.. మూడేళ్ల తర్వాత అది లభించింది. ఆపై 2013లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకుని.. 2017లో థీసిస్ సమర్పించారు. 2019లో పీహెచ్‌డీ పట్టా దక్కింది కమల్‌కి. అంతేకాదు.. అదే ఊపుతో లెక్చరర్‌షిప్‌కు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) పూర్తి చేసి.. నొటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు.
ఇంటర్వ్యూకి..
అయితే లక్ష్య సాధనకు ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. 2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్(BSUSC) టీఎంబీయూకి సంబంధించిన నాలుగు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అందులో కమల్ కిషోర్ మండల్ కూడా ఒకరు. మే 19, 2022న ఫలితాలు వెలువడగా.. అందులో అర్హత సాధించి.. ఏ యూనివర్సిటీలో అయితే బంట్రోతుగా పని చేశారో.. ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అక్టోబర్ 12వ తేదీన ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో చేరారు.
Success Story : పెట్టుబడి రూ.2 లక్షలే.. టర్నోవర్ మాత్రం కోట్లలో.. ఇదే మా విజయ రహస్యం..
వీరి వల్లే విజయం సాధించా..
పేదరికం, కుటుంబ సమస్యలు నా చదువుకు ఆటంకంగా మారలేదు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ చేసేవాడిని. రాత్రి పూట చదువుకునేవాడిని. సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నా..
ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని..
పరిస్థితులు అనుకూలించలేదని, పేదరికం వల్లే తాము చదువు దూరమయ్యామని, మంచి ఉద్యోగం సాధించలేకపోయామని కొందరు చెబుతుంటారు. కానీ, చదువుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉంటే పేదరికం ఆటంకం కాదనే నిరూపించాడు కమల్. ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించిన కిశోర్ మండల్ సమాజానికి ఓ ప్రేరణ.
☛ Inspiring Success Story : పరీక్షల్లో ఫెయిల్.. జీవితంలో పాస్.. ఏడాది రూ.2 కోట్ల పైగా ఆదాయంతో..