Skip to main content

Preparation‌ Guidance‌: ఒకే సమయంలో.. ప‌లు ఉద్యోగ పరీక్షలకు ప్రిపరేషన్ ఇలా..

బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగ పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్స్, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నోటిఫికేషన్లకు డిగ్రీతోనే హాజరుకావచ్చు. అభ్యర్థులు ఉద్యోగ పరీక్షల విధానం, సిలబస్‌పై అవగాహన పెంచుకొని.. నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగవుతాయి. ఆయా పోటీ పరీక్షల్లో సిలబస్‌ అంశాలు దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకొని అడుగులు వేస్తే.. ఒకే సమయంలో పలు పరీక్షలకు సన్నద్ధత పొందే ఆస్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. పలు ఉద్యోగ పరీక్షలకు ఒకే సమయంలో సన్నద్ధత పొందడం ఎలాగో తెలుసుకుందాం...
Govt Jobs: How to prepare for multiple Competitive Exams In The Same Timeframe?
Govt Jobs: How to prepare for multiple Competitive Exams In The Same Timeframe?

కామన్‌ టాపిక్స్‌.. గుర్తింపు

ఉద్యోగార్థులు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ముందుగా సిలబస్‌లోని కామన్‌ టాపిక్స్‌ను గుర్తించాలి. ప్రస్తుతం ఆయా పరీక్షలను గమనిస్తే.. అన్ని నియామక పరీక్షల్లోనూ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌(న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), రీజనింగ్‌ సబ్జెక్టులు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఆయా పరీక్షల్లో వీటికి దాదాపు 70 శాతం వరకు వెయిటేజీ ఉంటోంది. ఈ సబ్జెక్టులపై పట్టు సాధిస్తే.. ఒకే సమయంలో పలు పోటీ పరీక్షలకు సన్నద్ధత పొందినట్లే.

క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌

హైస్కూల్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజేస్, రేషియో–ప్రపోర్షన్, ప్రాఫిట్‌–లాస్, సింపుల్‌–కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, టైమ్‌–వర్క్, టైమ్‌–డిస్టెన్స్, పర్ముటేషన్స్‌–కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్‌ అండ్‌ అలిగేషన్స్, పార్టనర్‌ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను వేగంగా గణించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు సంబంధించి బోడ్‌మస్‌ రూల్స్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి.

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !
 

డేటా ఇంటర్‌ప్రెటేషన్‌

టేబుల్స్, చార్ట్‌లు, గ్రాఫ్‌ల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే.. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించాలంటే.. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రకాల గ్రాఫ్‌లను సాధన చేయాలి. ఈ విభాగంలో పట్టు కోసం టేబుల్స్, బార్‌ చార్ట్స్, పై చార్ట్స్‌ మొదలైన వాటిని ప్రాక్టీస్‌ చేయాలి.

రీజనింగ్‌

విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే రీజనింగ్‌ కోసం.. కోడింగ్, డీ–కోడింగ్, అనలిటికల్‌ పజిల్స్‌ బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇంగ్లిష్‌ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్‌ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అదే విధంగా అనలిటికల్‌ రీజనింగ్, సిలాజిజమ్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్‌–అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాల నుంచే బ్యాంకింగ్‌ పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. వీటి క్లిష్టత స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇంగ్లిష్‌

దాదాపు ప్రతి నియామక పరీక్షలో ఉండే సబ్జెక్ట్‌.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌. ఇందులో మంచి స్కోర్‌ సాధించేందుకు అభ్యర్థులు బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌పై పట్టు సాధించాలి. వీటితోపాటు స్పెల్లింగ్స్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్‌ ద సెంటెన్స్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్, ప్రెసిస్‌ రైటింగ్, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వీటితోపాటు టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, కాంప్లెక్స్‌ సెంటెన్సెస్‌ వంటి అంశాలపైనా దృష్టి సారించాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి. ఎస్‌ఎస్‌సీ లాంటి పరీక్షలకు ఇడియమ్స్, ఫ్రేజేస్, స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్‌ పరీక్షలకు పారా జంబుల్‌ సెంటెన్స్, క్లోజ్‌ టెస్ట్‌ విభాగాలు ముఖ్యం.

జనరల్‌ అవేర్‌నెస్‌

జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ స్టడీస్‌.. సివిల్స్‌ మొదలు బ్యాంకు పరీక్షల వరకూ.. అన్ని పోటీ పరీక్షల్లో కనిపించే విభాగం. సివిల్స్‌ వంటి అత్యున్నత పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. బ్యాంకు పరీక్షల కోసం బ్యాంకింగ్‌ రంగం, ఆయా బ్యాంకులు–వాటి సేవలు, లోగోలు, క్యాప్షన్లు వంటి వాటిని తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలి. ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో స్టాక్‌ జీకే నుంచే ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి.

చ‌ద‌వండి: Job Trends: కొత్త సంవత్సరంలో.. భరోసానిచ్చే కొలువులివే!
 

కంప్యూటర్‌ నాలెడ్జ్‌

ఇటీవల కాలంలో ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పరీక్షల్లో తప్పనిసరిగా కనిపిస్తున్న విభాగం.. కంప్యూటర్‌ నాలెడ్జ్‌. ఇందులో స్కోర్‌ సాధించేందుకు కంప్యూటర్‌ ఫండమెంటల్స్, బేసిక్‌ కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, నెట్‌వర్క్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ కాన్సెప్ట్స్, డీబీఎంస్, ఎంఎస్‌ ఆఫీస్‌లకు సంబంధించి బేసిక్‌ టెర్మినాలజీపై పట్టు సాధించాలి. దీంతోపాటు సిస్టమ్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌ టూల్స్, ఉపయోగాలు వంటి వాటిపైనా అవగాహన పెంచుకోవాలి.

‘ఉమ్మడి’గా ఇలా

ఆయా పోటీ పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న సిలబస్‌ అంశాలను గుర్తించి.. ప్రిపరేషన్‌ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఉమ్మడి టాపిక్స్‌ సిలబస్‌కు, ప్రత్యేక టాపిక్స్‌ సిలబస్‌కు సమయం కేటాయించుకోవాలి. సదరు పరీక్షల శైలిపై అవగాహన పెంచుకొని.. ప్రశ్నలు అడిగే తీరుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఉమ్మడి సిలబస్‌ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటూ.. ఆయా పోటీ పరీక్షలకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు.. ఉన్నత స్థాయి పరీక్షను తొలి ప్రాథమ్యంగా నిర్దేశించుకోవాలి. ఆ పరీక్ష స్థాయికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. ఉదాహరణకు.. జాతీయ స్థాయిలో సివిల్‌ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ అడుగులు వేస్తే.. యూపీఎస్‌సీ నిర్వహించే ఇతర పోటీ పరీక్షల్లోనూ విజయావకాశాలు మెరుగవుతాయి.

ఉన్నత పరీక్షపై గురి

రాష్ట్రాల స్థాయిలో.. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షల్లో ఉన్నత మైంది.. గ్రూప్‌–1. ఈ పరీక్ష లక్ష్యంగా అడుగులు వేస్తే.. ఆ తర్వాత స్థాయిలోని గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4లను తేలిగ్గానే సాధించే అవకాశం ఉంటుంది. బ్యాంకు పరీక్షల కోణంలోనూ.. ప్రొబేషనరీ ఆఫీసర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్‌ సాగిస్తే.. బాంకింగ్‌ రంగంలో దిగువ స్థాయిలో జరిగే క్లర్క్‌ పరీక్షల్లో విజయం సులభం అవుతుంది.

అంతా ‘ప్రత్యేకం’గా

ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు పటిష్ట వ్యూహాలు అనుసరించాలి. ముఖ్యంగా ఆయా పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా చదవాల్సిన అంశాలకు కొంత సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలో సదరు టాపిక్స్‌కు నోట్స్‌ రూపొందించుకుంటే.. పరీక్షకు ముందు రివిజన్‌కు ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఏవైనా రెండు పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉంటే.. ఈ ప్రత్యేక నోట్స్‌ ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది.

పరీక్ష తేదీలకు అనుగుణంగా

ఉమ్మడి సిలబస్‌తో పలు పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉంది.ఇదే సమయంలో ఏ పరీక్షకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే సందేహం కూడా ఉంటుంది. దీనికి పరిష్కారం.. ఆయా పరీక్షల తేదీలకు అనుగుణంగా అడుగులు వేయడం. ముందుగా పరీక్ష జరిగే పోస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉమ్మడిగా ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. ముందుగా జరిగే పరీక్షకు కనీసం నెల రోజులు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ఆ తర్వాత మరో పరీక్షకు ప్రిపరేషన్‌ సాగించాలి.

పరీక్ష ఏదైనా.. డిస్క్రిప్టివ్‌గా

పరీక్ష ఏదైనా డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదివితే విజయావకాశాలు మెరుగవుతాయి. ముఖ్యంగా సివిల్స్‌ వంటి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలోని పరీక్షలు; అలాగే∙పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే గ్రూప్‌–2, 3, 4, ఇతర పోటీ పరీక్షలకు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. వ్యాసరూప విధానంలో చదవడం ద్వారా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. ఇలా రెండు రకాల పరీక్షల్లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తంగా చూస్తే.. ఆయా పరీక్షల తేదీలు మొదలు సిలబస్‌ అంశాలు, వెయిటేజీ, సమయ పాలన, డిస్క్రిప్టివ్‌ అప్రోచ్, నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ఒకే సమయంలో పలు పోటీ పరీక్షల్లో సక్సెస్‌ సొంతమవుతుంది.

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

Published date : 16 Feb 2022 06:15PM

Photo Stories