Skip to main content

Any Competitive Exam: పరీక్షలెన్నో.. ప్రిపరేషన్‌ ఒక్కటే!

How to Prepare for Any Competitive Exam
How to Prepare for Any Competitive Exam

ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారా..  పరీక్షలో విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్నారా..! ఒక్క ప్రిపరేషన్‌తోనే.. అనేక పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అందుకు కావాల్సిందల్లా.. ఆయా ఉద్యోగ పరీక్షల సిలబస్‌ను సానుకూలంగా మలచుకోవడమే!! తద్వారా ఒకే సమయంలో పలు పోటీ పరీక్షలకు హాజరై.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌బీఐ, త్రివిధ దళాలతోపాటు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిత్యం ఏదో ఒక నోటిఫికేషన్‌తో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉద్యోగార్థులు ఒకే ప్రిపరేషన్‌తో పలు పోటీ పరీక్షల్లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...

  • ఉద్యోగ నియామక పరీక్షలన్నింటిలో ఉమ్మడి అంశాలు
  • ఇంగ్లిష్, మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్‌లకు సిలబస్‌లో పెద్దపీట
  • ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, సర్వీస్‌ కమిషన్లు, ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో కామన్‌ సిలబస్‌
  • సానుకూలంగా మలచుకుంటే కొలువు ఖాయం అంటున్న నిపుణులు 
  • పరీక్ష ఏదైనా డిస్క్రిప్టివ్‌ దృక్పథంతో అన్నింటికీ సన్నద్ధత 

బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా యూపీఎస్సీ సివిల్స్‌ మొదలు బ్యాంక్‌ ఉద్యోగాల వరకూ.. అనేక పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి సిలబస్‌లో చాలా వరకూ ఉమ్మడి అంశాలు ఉంటాయి. ఉద్యోగార్థులు దీన్ని సానుకూలంగా మలచుకొని.. విస్తృత దృక్పథంతో ఆయా సబ్జెక్ట్‌లు/టాపిక్స్‌పై పట్టు సాధిస్తే.. ఒక్క ప్రిపరేషన్‌తో పలు పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.


చ‌ద‌వండి: APPSC Groups Practice Tests

సివిల్స్‌ టు క్లర్క్‌

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే సీజీఎల్‌ పరీక్ష.. ఐబీపీఎస్, ఎస్‌బీఐలు ఎంపిక ప్రక్రియ చేపట్టే పీఓ, క్లరికల్‌ పోస్ట్‌లు.. ఆర్‌ఆర్‌బీ జరిపే టెక్నికల్, నాన్‌–టెక్నికల్‌ పోస్టులకు లక్షల మంది హాజరవుతుంటారు. ఎక్కువ మంది ఏదో ఒక పరీక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. కాని కొంత విస్తృత దృష్టితో ఆలోచిస్తే.. ఒకటే ప్రిపరేషన్‌తో పలు పోటీ పరీక్షలకు హాజరై.. సర్కారీ కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

అన్నింటా.. అవే అంశాలు

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఆర్మీ.. ఇలా ఏ సంస్థ చేపడుతున్న నియామక ప్రక్రియను చూసినా.. రాత పరీక్షల సిలబస్‌లో దాదాపు ఒకే అంశాలు ఉంటున్నాయి. ఏ పోటీ పరీక్ష సిలబస్‌ను చూసినా.. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి అంశాలకే పెద్దపీట. 

సివిల్స్, గ్రూప్స్‌లో సైతం

బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు సివిల్‌ సర్వీసెస్, గ్రూప్స్‌ పరీక్షలపై ఎక్కువగా దృష్టిపెడతారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో పేపర్‌–2గా పేర్కొనే సీశాట్‌(సివిల్‌ సర్వీసెస్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌)లో, అలాగే గ్రూప్‌ 1, 2 జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ల్లో.. మెంటల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్,రీజనింగ్, అర్థమెటిక్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.

 

చ‌ద‌వండి: Guidance

‘జనరల్‌’గా అవేర్‌నెస్‌

దాదాపు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌లో కనిపిస్తున్న మరో ముఖ్య టాపిక్‌.. జనరల్‌ అవేర్‌నెస్‌. బ్యాంక్‌ పరీక్షలు మొదలుకొని ఇతర అన్ని పరీక్షల్లోనూ జనరల్‌ అవేర్‌నెస్‌ టాపిక్‌ కీలకంగా ఉంటోంది. దీంతో ప్రశ్నల సంఖ్య, మార్కులతో
సంబంధం లేకుండా.. అభ్యర్థులు జనరల్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్‌పైనా పట్టు సాధించాల్సి ఉంటుంది. 

ప్రత్యేక టాపిక్స్‌

ఒకేరకమైన సిలబస్‌తో పలు పరీక్షలు జరుగుతున్నప్పటికీ.. ప్రతి పరీక్ష విషయంలో కొంత ప్రత్యేకత ఉంటుంది. అభ్యర్థులు ఆయా పరీక్షలకు సంబంధించి కొన్ని కొత్త టాపిక్స్‌ చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఎస్‌ఎస్‌సీ పరీక్షలను లక్ష్యంగా చేసుకొని..
బ్యాంకు పరీక్షలకు కూడా పోటీ పడాలనుకునే విద్యార్థులు.. బ్యాంక్‌ ఎగ్జామ్స్‌ కోసం బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ టాపిక్‌ను ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. 

నిర్దిష్ట వ్యూహం

  • మొదట సదరు పరీక్షల సిలబస్‌ను పరిశీలించాలి.
  • ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాయాలనుకున్నప్పుడు.. ఆయా పరీక్షల సిలబస్‌లో ఉమ్మడి అంశాలు గుర్తించాలి. 
  • అదే విధంగా ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌ కూడా తెలుసుకోవాలి.
  • ఉమ్మడి టాపిక్స్‌ సిలబస్‌కు, ప్రత్యేక టాపిక్స్‌ సిలబస్‌కు ప్రిపరేషన్‌లో నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. 
  • ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను, పుస్తకాలను సేకరించుకోవాలి. 
  • ఆయా పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్న తీరుపై అవగాహన పెంచుకోవాలి.
  • ప్రశ్నలు అడిగే తీరుకు సరితూగేలా ప్రిపరేషన్‌ వ్యూహాలు రూపొందించుకోవాలి.
  • ఇలా సిలబస్‌ పరిశీలన నుంచి ప్రశ్నల తీరు వరకు.. ముందస్తు కసరత్తుతో స్పష్టత తెచ్చుకుంటే..ఒకే సమయంలో పలు పరీక్షలకు సన్నద్ధత పొందే సామర్థ్యం లభిస్తుంది. 

ఉన్నత లక్ష్యంపై గురి

  • ఉమ్మడి సిలబస్‌ను సానుకూలంగా మలచుకుంటూ.. తమకు అర్హత ఉన్న అన్ని పోటీ పరీక్షలకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు.. ఉన్నత స్థాయి పరీక్షలో విజయమే తొలి ప్రాధాన్యంగా ప్రిపరేషన్‌ను సాగించాలి. ఉదాహరణకు బ్యాంకు పరీక్షల్లో.. ప్రతిష్టాత్మక పోస్టు ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో)ను లక్ష్యంగా చేసుకొని.. ప్రిపరేషన్‌ సాగిస్తే.. దిగువ స్థాయిలో జరిగే క్లర్క్‌ నియామక పరీక్షల్లో సులభంగానే విజయం సొంతం చేసుకోవచ్చు. 
  • జాతీయ స్థాయిలో సివిల్‌ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్‌ సాగిస్తే.. యూపీఎస్సీ నిర్వహించే ఇతర పోటీ పరీక్షలతోపాటు రాష్ట్రాల స్థాయిలో.. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌–1, గ్రూప్‌ 2ల్లో సక్సెస్‌ సాధించే అవకాశం ఉంటుంది. 

‘ప్రత్యేక’ సమయం, నోట్స్‌

ఆయా పరీక్షలకు ఉమ్మడి సిలబస్‌ ఉన్నా.. కొన్ని ప్రత్యేక అంశాలను చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. అభ్యర్థులు సదరు ప్రత్యేక అంశాల ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయించాలి. ప్రత్యేక టాపిక్స్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే.. వాటికి సంబంధించి సొంతం నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది పరీక్ష సమయంలో రివిజన్‌కు ఎంతో ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఏవైనా రెండు పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉన్న సందర్భంలో... ఈ నోట్స్‌ రివిజన్‌కు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

ఆబ్జెక్టివ్‌.. డిస్క్రిప్టివ్‌

రెండు, మూడు పరీక్షలకు పోటీ పడినా.. ఒక పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో, మరో పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటే ఎలా చదవాలి? అనే సందేహం అభ్యర్థులకు ఎదురవుతుంది. ముఖ్యంగా గ్రూప్‌–1, సివిల్స్‌ వంటి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షల అభ్యర్థులు.. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే గ్రూప్‌–2, బ్యాంక్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించే సందర్భంలో కొంత సందిగ్ధతకు గురవుతారు. పరీక్ష విధానం ఏదైనా.. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగితే.. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా రెండు రకాల పరీక్షల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఇలా.. తొలి అడుగు నుంచే నిర్దిష్ట వ్యూహం, పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. ఒకే సమయంలో పలు పరీక్షలకు హాజరై.. ఏదో ఒక సర్కారీ కొలువు ఖాయం చేసుకోవచ్చు.

కలిసొచ్చే.. ఎన్‌ఆర్‌ఏ సెట్‌

వచ్చే ఏడాది నుంచి కేంద్రం ఎన్‌ఆర్‌ సెట్‌(నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ–కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)ను నిర్వహించే అవకాశం ఉంది. ఇది ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ల రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లకు సంబంధించి తొలి దశ పరీక్షగా నిలుస్తుంది. దీంతో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్‌ఆర్‌ఏ సెట్‌లో ఉత్తీర్ణత సాధించి.. తర్వాత దశలో ఆయా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లు నిర్వహించే మరో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇది పోటీ పరీక్షల అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

పోటీ పరీక్షలు.. ఉమ్మడి అంశాలు
ఇంగ్లిష్‌

ప్రతి పోటీ పరీక్షలోనూ తప్పనిసరిగా కనిపిస్తున్న విభాగం.. ఇంగ్లిష్‌. ఇందుకోసం.. అభ్యర్థులు బేసిక్‌ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించాలి. తర్వాత వొకాబ్యులరీపై గురి పెట్టాలి. అదే విధంగా.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యక దృష్టి పెట్టాలి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

ఇంగ్లిష్‌లోనే ఒక ప్రత్యేక భాగంగా భావించే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలకు ప్యాసేజ్‌ ఆధారితంగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో మంచి స్కోర్‌ చేసేందుకు.. ఒక ప్యాసేజ్‌ను చదివి.. అందులోని కీలక అంశాలను ఆకళింపు చేసుకోవడం, వాటి ఆధారంగా సమాధానాలు గుర్తించడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ప్రముఖ ఇంగ్లిష్‌ దినపత్రికల ఎడిటోరియల్స్, ఆయా రంగాల నిపుణుల రాసే వ్యాసాలు చదవడం ఉపకరిస్తుంది.

క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ తప్పనిసరిగా ఉండే విభాగం.. క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌. ఈ విభాగంలో రాణించడానికి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

రీజనింగ్‌

అన్ని పోటీ పరీక్షల్లోనూ ఉంటున్న మరో విభాగం.. రీజనింగ్‌. దీనికి సంబంధించి ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కిక విశేషణ, తులనాత్మక విశ్లేషణ సామర్ధ్యాలు పెంచుకోవాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్‌

బ్యాంకు, ఎస్‌ఎస్‌బీ పరీక్షల్లో కీలకంగా నిలుస్తున్న విభాగం.. డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌. ఇందులో రాణించాలంటే.. అభ్యర్థులు గణన నైపుణ్యాలు పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ

అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్‌ నైపుణ్యాలను పరిశీలించేందుకు దాదాపు అన్ని పరీక్షల్లోనూ అడుగుతున్న విభాగం.. న్యూమరికల్‌ ఎబిలిటీ. ఇందులో రాణించాలంటే.. పదో తరగతి స్థాయి మ్యాథమెటికల్‌ అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా బాడ్‌మాస్, స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, కూడికలు, తీసివేతలు, భాగహారాలను వేగంగా చేయగలిగే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. 

జనరల్‌ అవేర్‌నెస్‌

సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు సంబంధించిన కీలక విభాగం.. జనరల్‌ అవేర్‌నెస్‌. ఇందులో చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాల్లో పరిపూర్ణ అవగాహన ఉండాలి. బ్యాంకు పరీక్షలను లక్ష్యంగా చేసుకున్నఅభ్యర్థులు ఆర్థిక రంగంలో సమకాలీన పరిణామాల గురించి తెలుసుకోవాలి.

చ‌ద‌వండి: Study Material

Published date : 25 Nov 2021 05:46PM

Photo Stories