Skip to main content

Online Exams Facts: ఆన్‌లైన్ పరీక్షల్లో మోసాలు చేసే అవ‌కాశం ఉంటుందా.. ఉండ‌దా..? వాస్త‌వాలు ఇవే..!

నేటి టెక్నాల‌జీ యుగంలో కేంద్ర స్థాయి ప‌రీక్ష‌ల నుంచి రాష్ట్ర స్థాయి ప‌రీక్ష‌ల వ‌ర‌కు ఎక్కువ‌గా ఆన్‌లైన్‌లోనే రాస్తున్నారు.
advantages and disadvantages of online exam
Online Exam Facts

ఎంసెట్, జేఈఈ మెయిన్, నీట్ , క్యాట్, జీమ్యాట్ మొద‌లైన ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తున్నారు.  
అలాగే ప్రభుత్వ‌ ఉద్యోగాల భర్తీకి జరిగే పోటీ పరీక్షలను కూడా కంప్యూటర్ ఆధారితంగా (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. ఇంత వ‌రకు అంతా భాగ‌నే ఉంది. స‌రిగ్గా ఇదే సమయంలో ఈ ఆన్‌లైన్ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందే లీక్ అవుతున్నట్లు ఆరోపణలు ఎన్నో.. వెల్లువెత్తుతున్నాయి.

తమ దగ్గర రేపు జరగబోయే ఆన్‌లైన్ పరీక్ష ప్రశ్న పత్రం ఉందంటూ.. అభ్యర్థుల దగ్గర నుంచి లక్షలు గుంజుతున్న మోసాలు బయటపడుతున్నాయి. మరోవైపు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించే నిపుణులు మాత్రం.. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారమే ఉండదని కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ పరీక్షల్లో మోసాలు జరగడానికి అవకాశముందా? ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అవుతున్నాయి? ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా..!

ఆన్‌లైన్ పరీక్షల్లోనూ చీటింగ్!

Online Exam


ఆన్‌లైన్ విధానంలో జరిగే పోటీ పరీక్షల్లో మోసాలకు ఆస్కారమే లేదని నియామక సంస్థలు ధీమాగా చెబుతుంటాయి. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు పోటీప‌రీక్ష‌ల్లో మోసాలు, ప్ర‌శ్న‌ప‌త్రాల లీక్ వ్య‌వ‌హారాలు.. మొద‌లైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వ‌చ్చిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. అహర్నిశలు కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు తలనొప్పిగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వచ్చాక కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఆన్‌లైన్ పరీక్షల్లోనూ మోసాలు జరుగుతున్నట్లు బయటపడుతుండడం విద్యార్థులను, నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో..
జాతీయ, రాష్ట్ర స్థాయి నియామక సంస్థలతోపాటు.. ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే ఏజెన్సీలన్నీ ఆన్‌లైన్ బాటపడుతున్నాయి. దాదాపుగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతున్నాయి. ఈ ఆన్‌లైన్ పరీక్షల కోసం నిపుణుల బృందం పెద్ద సంఖ్యలో ప్రశ్నలను సిద్ధం చేస్తుంది. ఈ ప్రశ్నల నిధి నుంచి పరీక్ష బ్లూ ప్రింట్‌కు అనుగుణంగా అవసరమైన ప్రశ్నలను సాఫ్ట్‌వేర్ అల్గారిథం ఎంపిక చేస్తుందని చెబుతున్నారు. అంతేగాకుండా ఆయా ప్రశ్నల నిధిని వ్యక్తిగతంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఎవరికీ ఉండదంటున్నారు. ప్రశ్నలను కాని, ప్రశ్న పత్రాల్ని కాని ఎలాంటి పరిస్థితుల్లోనూ పేపర్‌పై రాయడం కాని, ప్రింట్ చేసే అవకాశం ఉండదని ప్రముఖ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే సంస్థ నిపుణుడు ఒకరు తెలిపారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్ ప్రశ్నపత్రం ముందే వెల్లడి కాదని(లీక్) ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ప్రశ్న రహస్యమే.. కానీ

Question Paper


నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి ప్రశ్న రహస్యంగానే ఉంటుంది. అల్గారిథం ఆధారంగా సిద్ధమమ్యే ప్రశ్నపత్రం టెస్టు సెంటర్లకు వెళ్లడానికి ముందే ఎన్‌క్రిప్ట్ చేసే విధంగా టెక్నాలజీ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్ అభ్యర్థి పరీక్ష ప్రారంభించి.. మౌస్‌తో క్లిక్ చేసే వరకు రహస్యంగానే ఉంటుంది. మౌస్‌తో క్లిక్ చేసిన తర్వాతే డిక్రిప్ట్ అవుతుంది. అంటే.. ఆన్‌లైన్ పరీక్ష ప్రశ్నపత్రం గురించి ఏ ఒక్కరికి తెలిసే అవకాశమే లేదు. కానీ, కొందరు తమ వద్ద రేపు రాయబోయే ప్రశ్నపత్రం ఉందంటూ.. అమాయకులను మోసగించి అందినకాడికి దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల విద్యార్థులు, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు..
ఆన్‌లైన్ పరీక్షల విధానంలో.. పక్కన పరీక్ష రాస్తున్న వారి దాంట్లో చూసి కాపీ కొట్టే అవకాశమే ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే.. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షలో ప్రశ్నల సంఖ్య క్రమం, మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలకు ఆప్షన్ల క్రమం పూర్తిగా వేర్వేరు ఉండేలా స్మార్ట్ అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల పక్కవారి ప్రశ్నపత్రం నుంచి చూసి కాపీ కొట్టడానికి అవకాశం ఉండదు. అలానే కంప్యూటర్ తెరపై ఒకసారి ఒకటే ప్రశ్న కనిపిస్తుంది. దీనికి తోడు ప్రతి ప్రశ్నకు నిర్దేశిత సమయం కేటాయిస్తారు. ఇతర మార్గాల ద్వారా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినా.. నిర్దేశిత సమయంలో సమాధానాలు గుర్తించలేరని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆన్‌లైన్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు ఆస్కారం ఉండదంటున్నారు.

సర్వర్‌ను హాక్ చేయడం దాదాపు.. 

server hack


ఆన్‌లైన్ పరీక్షల్లో సర్వర్ సెక్యూర్‌గా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ఆన్‌లైన్ టెస్టులు నిర్వహిస్తున్న ఏజెన్సీలు సర్వర్‌కు పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సర్వర్‌లో స్టోర్ చేసే క్వశ్చన్ పేపర్లు ఎన్‌క్రిప్షన్ చేసి పెడతారు. వీటికి రిమోట్ యాక్సెస్ కూడా లేకుండా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలాంటి కఠిన నెట్‌వర్క్ సెక్యూరిటీ నిబంధనల వల్ల సర్వర్‌ను హాక్ చేయడం దాదాపు అసాధ్యం. కాబట్టి మోసం చేసేందుకు అవకాశమే ఉండదు. ఒకవేళ ఎవరైనా కంప్యూటర్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే.. వెంటనే సర్వర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కు అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తుంది.

ఆన్‌లైన్ పరీక్ష రాసే అభ్యర్థులు ముఖ్యంగా..

Exam


ఆన్‌లైన్ పరీక్ష రాసే అభ్యర్థుల గుర్తింపునకు టెస్టింగ్ ఏజెన్సీలు టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఆన్‌లైన్ టెస్టుల్లో మోసాలు అరికట్టడానికి అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించడంతోపాటు, వారి ఫోటోలు తీసి భద్రపరుస్తున్నాయి. సెల్‌ఫోన్లు, ఇతర బ్లూటూత్ వంటి డివైజ్‌లను పరీక్ష గదిలోకి తీసుకురాకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజ్‌లను బ్లాక్ చేయడానికి ఆర్‌ఎఫ్ సిగ్నల్ డిటెక్టర్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ కూడా సెంట్రల్ కమాండ్ సెంటర్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. అభ్యర్థులు కూర్చునే సీటింగ్ అరెంజ్‌మెంట్ కూడా చివరి నిమిషం వరకూ రహస్యంగానే ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ పరీక్షల్లో మోసాలు సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల జరగడం లేదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి లీకులకు తావుండదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.

చీట్ చేస్తే దొరికిపోతారు.. జాగ్ర‌త్త‌
ఆన్‌లైన్ టెస్టులు రాసే అభ్యర్థులు కొన్నిసార్లు స్క్రీన్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటి వారిని గుర్తించడం చాలా సులువు. స్క్రీన్‌పై కనిపించే ప్రతి క్వశ్చన్‌లో సదరు అభ్యర్థి ఐడీని కనిపెట్టే సాంకేతికత అందుబాటులో ఉండటం వల్ల చీటింగ్ చేసేవారిని ఇట్టే పట్టేయొచ్చు. పరీక్షలు రాస్తున్న వారు దళారుల మాయమాటల్లో పడొద్దు. మోసం చేస్తూ ఒకసారి పట్టుబడితే.. జీవితాంతం పోటీ పరీక్షల నుంచి నిషేధానికి గురికావడంతో పాటు, జైలు పాలు కావాల్సి ఉంటుంది.
                                   - వెంగుస్వామి రామస్వామి, గ్లోబల్ హెడ్ ఆఫ్ టీసీఎస్ అయాన్.

Published date : 09 Apr 2022 07:05PM

Photo Stories