Eamcet Rankers: ఎంసెట్‌లో రాణించిన కదిరి మండలం విద్యార్థులు
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో కదిరికి చెందిన విద్యార్థులు జయభేరి మోగించి ఉత్తమ ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన ఫైజా సమ్రీన్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 60వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి కదిరి మండలం కేఎన్ పాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్‌సైన్స్) గా పనిచేస్తున్నారు. తల్లి నస్రిన్ తలుపుల మండలంలోని ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఫైజా సమ్రీన్ విజయవాడలో శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. వైద్యురాలిగా సేవలు అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫైజా సమ్రీన్ పేర్కొంది.
● కదిరికి చెందిన కొమ్మ భువనేశ్వర్‌రెడ్డి అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 198వ ర్యాంక్ సాధించాడు. భువనేశ్వర్‌రెడ్డి విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి కొమ్మ ఈశ్వర్‌రెడ్డి తనకల్లు మండలం ఈతోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తల్లి శ్రీదేవి గృహిణి. గాండ్లపెంట మండలం మునగలవారిపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి కదిరి పట్టణంలో నివాసముంటున్నారు.
● కదిరి వైఎస్సార్ నగర్‌కు చెందిన కోలాకులం విజేత అనే విద్యార్థిని అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 492వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి ప్రసాద్‌నాయక్.. మిట్టపల్లి జెడ్పీహైస్కూల్‌లో పీడీగా, తల్లి అంజనమ్మ గోరంట్ల మండలం పులేరు హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కోలాకులం విజేత అనంతపురం నగరంలో ఇంటర్ చదివింది. పశువైద్యురాలిగా సేవలు అందించాలన్నది తన ధ్యేయమని పేర్కొంది.