PG admissions: పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్
నూజివీడు: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోసు్ట్రగాడ్యుయేషన్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించింది. పీజీ సీట్ల భర్తీకి ఈ ఏడాది ఏపీ పీజీసెట్–2023ని ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించగా, తాజాగా వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించారు. ఈ నెల 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనిలో భాగంగా ముందుగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టిక్కెట్ నెంబరు, పుట్టినరోజు ఆధారంగా లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు తమ ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
1975లో పీజీ కాలేజీ ఏర్పాటు
నూజివీడులోని కృష్ణా యూనివర్శిటీ ఎమ్మార్ అప్పారావు పీజీ కాలేజీలో 260 సీట్లు ఉన్నాయి. ఇక్కడి పీజీ కేంద్రం 1975లో ఆంధ్రాయూనివర్శిటీ పరిధిలో ఎమ్మార్ అప్పారావు కృషితో ఏర్పాటైంది. ఆ తరువాత ఇది నాగార్జున యూనివర్శిటీ పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఇది కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఉంది. ఎమ్మార్ అప్పారావు కాలేజీ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో మొత్తం 260 పీజీ సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 40 సీట్లు, అనలైటికల్ కెమిస్ట్రీ 40, బయోకెమిస్ట్రీ 40, అప్లయిడ్ మ్యాథ్స్ 40, స్టాటిస్టిక్స్ 40, ఎం.కామ్ 40, ఎంబీఏ 60 సీట్ల చొప్పున ఉన్నాయి.
రూ. 6 కోట్లతో కొత్త అకడమిక్ భవనం
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు సెంటర్‌లో నూజివీడు ఉండటంతో విద్యార్థులు ఇక్కడ పీజీ కాలేజీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఇందులో చేరితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు సైతం వర్తిస్తాయి. క్యాంపస్‌లోనే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. అంతేగాకుండా ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో క్యాంపస్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నూతన అకడమిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే మరిన్ని సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి
నూజివీడులోని ఎమ్మార్ అప్పారావు కాలేజీ ఆఫ్ పోసు్ట్రగాడ్యుయేషన్ కోర్సుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో పాటు 25 నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన అధ్యాపకులున్నారు. ఈ కాలేజీలో చేరిన వారికి జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన సైతం వరిస్తుంది. కోస్తా జిల్లాల్లో నాణ్యమైన విద్యను అందించే కాలేజీల్లో ఇది ఒకటి. పేద వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.