JNTU Ranking: గర్వపడే స్థాయిలో జేఎస్టీయూ విశ్వవిద్యాలయం
సాక్షి ఎడ్యుకేషన్: ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్–2024లో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం– అనంతపురం (జేఎన్‌టీయూ (ఏ))కు చోటు దక్కింది. లండన్‌లోని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ గురువారం ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. భారతదేశంలో 91 సంస్థలు ర్యాంకులు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు యూనివర్సిటీలకు ర్యాంకులు రాగా అందులో జేఎన్‌టీయూ(ఏ) ముందుస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో 801–1000 ర్యాంకు, జాతీయస్థాయిలో 34వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు సాధించింది.
ఇదీ ర్యాంకులకు కొలమానం..
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ యూనివర్సిటీల ర్యాంకును ప్రకటించేందుకు 134 సైటేషన్లు, 1.65 కోట్ల రీసెర్చ్ పబ్లికేషన్లను పరిశీలించింది. అంతర్జాతీయంగా 2,673 విద్యా సంస్థల్లో 86,402 మంది పరిశోధన విద్యార్థులకు సంబంధించిన రీసెర్చ్ పబ్లికేషన్లు పరిశీలన చేశారు. ఇందులో జేఎన్‌టీయూ (ఏ)కు బోధనా నైపుణ్యంలో 28.9 పాయింట్లు, పరిశోధనలో 14.1 పాయింట్లు, పరిశోధన నాణ్యతలో 60.7 పాయింట్లు, పరిశ్రమల్లో ఉపాధికి సంబంధించి 17.5 పాయింట్లు, అంతర్జాతీయ అవుట్‌లుక్‌లో 19.6 పాయింట్లు దక్కాయి. ఫుల్‌టైం ఈక్వెలెంట్ స్టూడెంట్స్(ఎఫ్‌టీఈ), విద్యార్థి–అధ్యాపకుల నిష్పత్తి, పురుష-మహిళా విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. జేఎన్‌టీయూ అనంతపురంలో మొత్తం 6,175 మంది విద్యార్థులు రెగ్యులర్ కోర్సులు చదువుతుండగా, ప్రతి 18 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు బోధిస్తున్నారు. 41 మంది అమ్మాయిలు, 59 మంది అబ్బాయిలు చదువుతున్నారు.
ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లో చోటు దక్కడం గర్వకారణం
జేఎన్‌టీయూ(ఏ) కు అంతర్జాతీయ స్థాయి ర్యాంకు రావడం గర్వకారణం. రాష్ట్రంలో ఈ ర్యాంకులు దక్కించుకున్న ఏడు విద్యా సంస్థల్లో జేఎన్‌టీయూ అనంతపురం తొలి స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. న్యాక్ గ్రేడింగ్‌కు వెళ్లాం. త్వరలోనే న్యాక్ గుర్తింపుకు సంబంధించిన పీర్ కమిటీ పర్యటించనుంది. న్యాక్‌లోనూ మంచి గ్రేడింగ్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం.
– జింకా రంగజనార్దన,
వీసీ, జేఎన్‌టీయూఏ