UGC NET 2024: యూజీసీ నెట్‌కు నోటిఫికేషన్ విడుదల.. ఈ సారి పరీక్ష విధానం ఇలా..!
అమరావతి: జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ నెట్) జూన్ 2024కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉన్నత విద్యలో వృత్తి అభ్యాసనలో భాగంగా 83 సబ్జెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)– అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్–పీహెచ్‌డీ ప్రవేశం, కేవలం పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హత పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
AP SSC Results 2024: నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల
మే 10వ తేదీలోగా ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, 12వ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని సూచించింది. యూజీసీ గుర్తించిన వర్సిటీ నుంచి జనరల్ విద్యార్థులు పీజీలో 55 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు అర్హులుగా పేర్కొంది. పీహెచ్‌డీ కలిగిన వారికి 5 శాతం మార్కుల్లో సడలింపు ఇస్తున్నట్టు తెలిపింది.
ఈ ఏడాది నుంచి కొత్తగా..
నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ లేదా 8 సెమిస్టర్ల యూజీ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థుల్లో చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు జూన్ నెట్ పరీక్షకు అర్హులుగా యూజీసీ ప్రకటించింది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ చేస్తున్న అభ్యర్థులు ఏదైనా సబ్జెక్ట్‌లో నెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఇచ్చింది. అంటే, వారు గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్టులో మాత్రమే నెట్ పరీక్షకు హాజరుకావాలని ఎటువంటి నిబంధన లేదు. అయితే, అభ్యర్థి నెట్ పరీక్ష సబ్జెక్టుల నుంచి పీహెచ్‌డీ చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.
ఏటా రెండుసార్లు
దేశవ్యాప్తంగా ఏటా రెండు సెషన్లలో జూన్, డిసెంబర్‌లో యూజీసీ నెట్ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. ఏటా 8 నుంచి 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గత డిసెంబర్‌లో 292 పట్టణాల్లో నిర్వహించిన పరీక్షకు 9.45 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 6.95 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 58,794 మంది అర్హత సాధించారు. ఇందులో 53,762 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, 5,032 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) రెండింటికీ అర్హులుగా నిలిచారు.
H5N1 Bird Flu: తొలిసారి ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష
► యూజీసీ నెట్‌ను ఓఎంఆర్ (పెన్ అండ్ పేపర్) పద్ధతిలో జూన్ 16న నిర్వహిస్తుంది
► ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లలో కలిపి మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది
► నెగెటివ్ మార్కుల నిబంధన లేదు
► రెండు పేపర్లలో కలిపి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం, ఇతరులు 35 శాతం మార్కులు సాధిస్తే యూజీసీ నెట్‌కు అర్హత సాధిస్తారు
► అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్‌కు కటాఫ్‌ను ఫలితాల తర్వాత ప్రకటిస్తారు
► జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.325 పరీక్ష ఫీజు చెల్లించాలి
► దరఖాస్తుల సవరణకు మే 13 నుంచి 15 వరకు అవకాశం ఉంటుంది
►ఆ తర్వాత పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డుల వివరాలను ప్రకటిస్తారు