Medical PG: ‘పీజీ అడ్మిషన్ల’ దందాలో తనిఖీలు షురూ
- ఆరోగ్య వర్సిటీ నుంచి రికార్డులు తీసుకెళ్లిన పోలీసులు
- ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియపైనా ఆరా
- సహకరించని కొన్ని కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కేసు పెట్టడంతో వర్సిటీకి వెళ్లి పలు రికార్డులను పరిశీలించారు. అవసరమైన వాటిని తీసుకెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోని రికార్డులనూ పరిశీలిస్తూ అవసరమైన సమాచారాన్ని తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం పోలీసులకు సహకరించట్లేదని, రికార్డులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని చెబుతున్నారు. తమ వద్ద ఎలాంటి అక్రమాలు జరగలేదని, రికార్డులు ఇవ్వబోమని అంటున్నట్లు తెలిసింది. ఇక అనుమానంగా ఉన్న 34 దరఖాస్తుదారులపై ఆరోగ్య వర్సిటీ దృష్టిపెట్టింది. అందరికీ లేఖలు రాసింది. వీరంతా మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులే. ఇందులో 18 మంది కాలేజీల్లో చేరగా మరో 16 మందిలో ఏడుగురు స్పందించారు. తమ తరఫున ఎవరు దరఖాస్తు చేశారో తెలియదని వర్సిటీకి తెలిపారు. మిగిలిన 9 మంది నుంచి ఇంకా జవాబు రాలేదని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
also read; Carbon Neutral Panchayat: దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ ఏది?
విచారణ ఎప్పుడు ముగుస్తుందో..: ఏడుగురు విద్యార్థులను విచారించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరంతా బీహార్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు. విద్యార్థులను పిలిపించడమా.. లేక పోలీసులే అక్కడికెళ్లి విచారిస్తారా తెలియాల్సి ఉంది. వీరి వెనుక ఉండి నడిపిస్తున్న ఏజెన్సీలపైనా పోలీసులు దృష్టి పెట్టినట్లు ఆరోగ్య వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడే చెప్పలేమని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమకు ఇన్‌సరీ్వస్ కోటా సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కొందరు మెడికల్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. 99 పీజీ మెడికల్ సీట్లు తమకు దక్కకుండా బదలాయించారని వారు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇందులో ఎలాంటి అన్యాయం జరగలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
Also read: TSRTC: కారుణ్య నియామకాలు