TSRTC: కారుణ్య నియామకాలు
అయితే ప్రస్తుతం కనీస వేతనాల చెల్లింపు(ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పద్ధతిలో మాత్రమే వీటిని చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులకు సంబంధించిన (చనిపోయినవారు, తీవ్ర అనార్యోగానికి గురైనవారు) కుటుంబసభ్యులు మూడేళ్లుగా బ్రెడ్ విన్నర్ స్కీం కింద కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులో తొలి విడతలో 300 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకోబోతోంది. వారి పనితీరు బాగుంటే రెండేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేయనున్నారు. తదుపరి రిటైర్మెంట్లతో పోస్టులు ఖాళీ అయ్యేకొద్దీ మిగతావారిని తీసుకోవాలని బోర్డు సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి తొలి సమావేశం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఏప్రిల్ 23న ఇక్కడ జరిగింది. చైర్మన్ సహా 9 మంది బోర్డు సభ్యులకుగాను ఏడుగురు సమావేశానికి హాజరయ్యారు. పనిఒత్తిడి కారణంగా జీహెచ్‌ఎంసీ, రవాణాశాఖ కమిషనర్లు హాజరు కాలేదు. కారుణ్య నియామకాలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆర్టీసీ ఎండీకి బోర్డు సూచించింది.
ఏడేళ్ల అకౌంట్స్‌కు అనుమతి
టీఎస్ ఆర్టీసీ ఏర్పడిన ఏడేళ్లలో ఆర్థికపరమైన పద్దులకు ఇప్పుడు బోర్డు ఆమోద ముద్ర(రాటిఫికేషన్) వేసింది. ఈ ఖాతాలకు సంబంధించి ఏజీ ఆడిట్ ఇప్పుడు నిర్వహించాల్సి ఉంది. ఆడిట్ కాకపోవడం వల్ల ఇంతకాలం బ్యాంకు రుణాలు తీసుకునే విషయంలో ఆర్టీసీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.