Navin Mittal: మేనేజ్‌మెంట్ రంగానికి ఉజ్వల భవిష్యత్
కాచిగూడ: ప్రపంచ దేశాల్లో మేనేజ్‌మెంట్ రంగానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. రాష్ట్రంలో డిగ్రీ, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థుల ఉపాధి సమస్యల పరిష్కారం, నైపుణ్య అభివృద్ధిపై పాఠ్యాంశాల రూపకల్పన అంశంపై సోమవారం హోటల్ తాజ్ వివంతాలో రౌడ్‌టేబుల్ సమావేశం జరిగింది. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తే మేనేజ్‌మెంట్‌పై పట్టు సాధించవచ్చన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మేనేజ్‌మెంట్ రంగంలో ఉజ్వల భవిష్యత్‌ను విద్యార్థులు గుర్తించ లేకపోతున్నారన్నారు. విద్యార్థులు ఉద్యోగ అధారిత కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులు వేదుల సుబ్బారావు, కవిత రాజేశ్, రామచందర్, డాక్టర్ రవికుమార్ జైన్, డాక్టర్ రేణుక సాగర్ తదితరులు పాల్గొన్నారు.