Jobs: పుంజుకుంటున్న శాలరీడ్ జాబ్స్
గత 2 నెలల్లోనే నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగులు (శాలరీడ్ వర్కర్స్) 85 లక్షల మేరకు పెరిగినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో శాలరీడ్ జాబ్స్ పెరుగుదల కారణంగానే ఇది సాధ్యమైందని చెబుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే త్వరలోనే కరోనా వ్యాప్తికి ముందున్న పరిస్థితులకు చేరుకునే అవకాశముందని కొన్ని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం శాలరీడ్ వర్కర్స్ (ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నమోదైన వారు) 8.6 కోట్ల దాకా ఉంటారని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే గత సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో ఇతర రూపాల్లోని వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు తగ్గినట్టు తాజా గణాంకాల ఆధారంగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విశ్లేషిస్తోంది.
చదవండి: NTRO Recruitment 2022: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 125 ఉద్యోగాలు.. నెలకు రూ.48,000 వరకు వేతనం..
9 కోట్లకు చేరుకుంటేనే..
2020 జనవరి నాటికి అత్యధికంగా 8.9 కోట్ల శాలరీడ్ జాబ్స్ ఉండేవని సీఎంఈఐ సీఈవో మహేశ్ వ్యాస్ తెలిపారు. కరోనా లాక్‌డౌన్ విధించినా అదే ఏడాది మార్చి నాటికి శాలరీడ్ జాబ్స్‌పై తక్కువ ప్రభావమే పడిందని చెప్పారు. కానీ ఆ తర్వాత కొంత తగ్గుదల చోటు చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఈ జాబ్‌ల సంఖ్య 8.6 కోట్ల వరకు ఉండగా 9 కోట్లకు చేరుకుంటేనే కరోనా కాలం నాటి ముందురోజులకు చేరుకుని పూర్తి స్థాయిలో రికవరైనట్టుగా చెప్పవచ్చునని అన్నారు.
ఇతర రూపాల్లోని ఉపాధి అవకాశాల్లో తగ్గుదల. దేశంలోని కార్మికవర్గం, జాబ్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఒడిదొడుకులు, అనిశ్చితిల ప్రభావం ఆయా రంగాల ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై పడుతున్నట్టుగా స్పష్టమౌతోంది. గత సెపె్టంబర్, అక్టోబర్‌లలో.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీలు, చిన్నచితకా వ్యాపారులు కలిపి మొత్తంగా 1.18 కోట్ల ఉపాధి అవకాశాలు కోల్పోయినట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు త్వరలోనే తిరిగి వచ్చే అవకాశాలున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2020 మార్చి నెలతో పోల్చితే ఏప్రిల్ నాటికి (లాక్‌డౌన్ విధించాక) 68 శాతం దినసరి కూలీలు, 25 శాతం చిన్న వ్యాపారులు ఉపాధిని కోల్పోయారని, శాలరీడ్ ఉద్యోగులు మాత్రం 18 శాతం ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎంఐఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
చదవండి: IIM Recruitment 2022: ఐఐఎం, రోహతక్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
రికవరీ పాక్షిక సత్యమే..
దేశం మొత్తంగా చూస్తే నిరుద్యోగిత శాతం పెరిగిందే తప్ప తగ్గలేదు. జాబ్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ రంగంలో రికవరీ జరుగుతుందనడం పాక్షిక సత్యమే. అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు పెరిగారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రోజువారీ కూలీలు, చిన్నా,చితకా వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయ సీజన్ మొదలైతే గ్రామీణ ప్రాంత ఉపాధి కొంత పుంజుకునే అవకాశాలున్నాయి.
– డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు