Skip to main content

Good News: 30 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకుల పదోన్నతులకు చర్యలు

రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేని ఎన్నో ప్రయోజనాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయులు, అధ్యాపకులకు చేకూరాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
adimulapu suresh
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సీఎం వైఎస్‌ జగన్ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ.. వారి బాగోగులపై ఆలోచన చేస్తున్నారన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగులను ఆదుకోవడంలో ముందుందన్నారు. ఫిబ్రవరి 4న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల కోసమే కాకుండా విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. దశాబ్దకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారని చెప్పారు.

రెండున్నరేళ్లలో 22,240 మందికి పదోన్నతులు

గడచిన రెండున్నరేళ్ల కాలంలో 22,240 మందికి పదోన్నతులు కల్పించిన ఘనత వైఎస్‌ జగన్ ప్రభుత్వానిదేనని మంత్రి సురేష్‌ గుర్తు చేశారు. 2019లో 975 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి ఇచ్చారన్నారు. అదే ఏడాది 5,540 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, తత్సమాన క్యాడర్‌ వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించిందన్నారు. 2020లో 516 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారని తెలిపారు. అదే ఏడాది 2,732 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, తత్సమాన క్యాడర్‌ వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించిందని గుర్తు చేశారు. 2021లో 280 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు గ్రేడ్‌ హెడ్మాస్టర్లుగా పదోన్నతి వచ్చిందన్నారు. 1,351 మంది ఎస్జీటీలు, ఇతర టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు పదోన్నతులపై దక్కాయని వివరించారు. ఎంతోకాలంగా బదిలీల కోసం ఎదురుచూసిన ఉపాధ్యాయులకు ఆన్ లైన్ ద్వారా ఎవరికీ ఇబ్బంది కలగకుండా బదిలీలు పూర్తి చేశామన్నారు. బదిలీ దరఖాస్తు చేసిన 1,72,083 మంది హెచ్‌ఎంలు, టీచర్లకు గాను 75,882 మందికి వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చినట్లు వివరించారు.

ఎల్‌పీ, పీఈటీల కల నెరవేరింది

లాంగ్వేజ్‌ పండిట్లు (ఎల్‌పీ), ఫిజికల్‌ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ) తమ పోస్టుల అప్‌గ్రెడేషన్ కోసం దశాబ్దానికి పైగా కాళ్లరిగేలా తిరిగినా వారి సమస్యను నాటి పాలకులు పరిష్కరించలేదని మంత్రి సురేష్‌ వివరించారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చాక 10,224 పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేసి వారి కలను నెరవేర్చామని చెప్పారు. అప్‌గ్రేడ్‌ చేయడమే కాకుండా వాటిలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించామన్నారు. ఇలా 2,603 మంది ఫిజికల్‌ ఎడ్యుకేషన్ టీచర్లు స్కూల్‌ అసిస్టెంటు (ఫిజికల్‌ ఎడ్యుకేషన్)గా పదోన్నతులు పొందారని వివరించారు.

మరో 30 వేల మందికి పదోన్నతులకు చర్యలు

త్వరలోనే మరో 30వేల మంది ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం 19వేల స్కూళ్లను మ్యాపింగ్‌ చేయించామని, వీటిలో 22 వేలకు పైగా సబ్జెక్టు టీచర్లు అవసరం ఉన్నందున ఈ పోస్టుల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఇంకో 17వేల స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం, రేషనలైజేషన్ ద్వారా 8 వేల మందికి పదోన్నతి లభిస్తుందన్నారు. మొత్తంగా 30 వేల మంది వరకు పదోన్నతులు పొందనున్నారని వివరించారు. ఎంఈవోల నియామకాలకు ప్రభుత్వం నిర్ణయించినందున ఆ పోస్టుల ద్వారా కూడా టీచర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

‘ఎంఈవోల సమస్యల పరిష్కారం చరిత్రాత్మకం’

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మండల విద్యాశాఖాధికారుల సమస్యలను పరిష్కరించడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ఎంఈవోల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం, కోశాధికారి సబ్బితి నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఎంఈవోల సమస్యల్ని పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈవోల ఆత్మగౌరవ సమస్య అయిన సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్‌ను కల్పించడం, మండల స్థాయిలో విద్యా సంబంధిత కార్యక్రమాలన్నీ ఎంఈవోల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం తమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.

చదవండి: 

Spoken English: బోధించే స్థాయిలో ఆంగ్ల శిక్షణ

TSTU: టీచర్ల సమస్యలపై సబిత హామీ: టీఎస్‌టీయూ

Good News: టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు పెంపు

ఉద్యోగుల విభజన విధివిధానాలపై విద్యాశాఖ తర్జనభర్జన

Published date : 05 Feb 2022 12:43PM

Photo Stories