Education Commission: ఇన్ని స్కూళ్లెందుకు?.. కొన్ని పాఠశాలలను విలీనం చేద్దాం..
అదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇన్ని స్కూళ్లెందుకు? విద్యార్థులు తక్కువున్న పాఠశాలలు కొన్నింటిని కలిపి పెద్ద స్కూల్‌గా చేద్దాం. మండలానికి ఇలాంటి నాలుగు స్కూళ్లు మాత్రమే ఉంటే బాగుంటుంది..’ అని కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయం వ్యక్తం చేశారు.
నవంబర్ 7న ఉపాధ్యాయ సంఘం టీఎస్ యూటీఫ్ ప్రతినిధులు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పలువురు సీనియర్ ఉపాధ్యాయులతో చైర్మన్ సమావేశమయ్యారు. పాఠశాలల పనితీరు, బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చించారు. పెద్ద స్కూళ్లలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. విద్యార్థి కేంద్రంగానే విద్యావ్యవస్థ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు.
చదవండి: Jana Vigyan Vedika: విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
హైదరాబాద్‌లోని ప్రైవేటు స్కూళ్లు 2 వేల మంది విద్యార్థులతో ఒకే ప్రిన్సిపల్‌తో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘ నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం వీధికో స్కూల్ పెడతానని వేదికలపై చెబుతుంటే, స్కూళ్లు తగ్గించే ఆలోచన ఏంటంటూ సంఘం నేతలు అడిగినట్లు సమాచారం.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
టీచర్లలో జవాబుదారీతనం పెరగాలి
మండలానికి నాలుగు స్కూళ్లు ఉంటే విద్యార్థులు కిలో మీటర్ల కొద్దీ వెళ్ళాల్సిన పరిస్థితి తలెత్తుతుందనే అభిప్రాయం సంఘం నేతలు వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు ఎన్ని కిలోమీటర్లయినా బస్సులు, ఆటోల్లో వెళ్తున్నారంటూ, ప్రభుత్వ స్కూళ్లకు కూడా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని చైర్మన్ ఆరా తీశారు.
ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి ఈ సందర్భంగా అనేక అంశాలు లేవనెత్తినట్టు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు తెలిపారు. టీచర్ల బోధన విధానంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. సరైన బోధన చేస్తుంటే విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారని అడిగినట్లు సమాచారం. టీచర్లలో జవాబుదారీతనం పెరగాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం: చైర్మన్
‘ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని వర్గాల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నాం. అన్ని వసతులతో పెద్ద స్కూళ్లు ఉండాలన్న అభిప్రాయం వ్యకం అవుతోంది.
మండలానికి మూడు నాలుగు పెద్ద స్కూళ్లు అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల వద్ద చర్చించా..’ అని చైర్మన్ మురళి తెలిపారు.
కార్పొరేట్ విద్యా వ్యాపారం అరికట్టాలి : యూటీఎఫ్
కార్పొరేట్ విద్యా వ్యాపారం అరికట్టాలని విద్యా కమిషన్‌ను టీఎస్ యూటీఎఫ్ కోరింది. చైర్మన్‌తో భేటీ వివరాలను సంఘం నేతలు జంగయ్య, చావా రవి, మీడియాకు తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని, తరగతికొక టీచరు, గది ఉండాలని, పట్టణీ కరణ నేపథ్యంలో పాఠశాలల రీ లొకేషన్ జరగాలని, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆకర్షణీయ మైన పాఠశాలలు, పటిష్టమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన బోధన ఉండాలని సూచించారు.