Andhra Pradesh: భారీగా పెరిగిన ఉద్యోగులు
ఏటా పెరుగుతున్న కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018–19తో పోలిస్తే 2022–23లో రాష్ట్రంలో ఈపీఎఫ్ ఖాతాలు 35 శాతం మేర పెరిగినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది.
టీడీపీ ప్రభుత్వం ఉండగా 2018–19లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలు ఉండేవి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి.
చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: ఏపీఎస్సీఎస్సీఎల్ లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరోపక్క ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. దీంతో 2020–21లో రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాల సంఖ్య 52.39 లక్షలకు పెరిగింది. అంతే సుమారు 5.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2021–22లో వీటి సంఖ్య 56.34 లక్షలకు పెరిగాయి.
2022–23లో 60.73 లక్షలకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో 2018–19లో 22.91 కోట్లుగా ఉన్న పీఎఫ్ ఖాతాలు 2022–23 నాటికి 29.88 కోట్లకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 30.38 శాతం ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన జాతీయ స్థాయి కన్నా రాష్ట్రంలోనే పీఎఫ్ ఖాతాల పెరుగుదల ఎక్కువ.
తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, తమిళనాడు, పుదుచ్చేరిలో 27 శాతం మేర ఖాతాలు పెరిగాయి. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే, మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.
అధికారం చేపట్టిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో యువతకు ఉద్యోగాలిచ్చారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా 1,25,110 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరోపక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు.
ఇలా వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ శాశ్వత, కాంట్రాక్టు పద్ధతుల్లో నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది.
ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదికల్లోనూ వెల్లడైంది. 2018–19లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 45 మంది, పట్టణాల్లో 73 మంది నిరుద్యోగులు ఉండగా 2022–23లో గ్రామాల్లో 33, పట్టణాల్లో 65కు నిరుద్యోగిత తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది.