Skip to main content

Fresher Jobs: జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్నారా? లేఆఫ్స్‌ వేళ.. ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌!

హైదరాబాద్‌: ఫ్రెషర్లకు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కంపెనీలలో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 6 శాతం పెరిగినట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 62 శాతంగా ఉంటే, 2024 మొదటి ఆరు నెలలకు సంబంధించి 68 శాతానికి పెరిగినట్టు పేర్కొంది.
Companies hiring more freshers in Hyderabad   freshers hiring increase   More job opportunities for entry-level professionals

ఇక క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి కెరీర్‌ అవుట్‌లుక్‌ నివేదికను టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం ప్రస్తుత ఏడాది జనవరి–జూన్‌ కాలానికి స్వల్పంగా పెరిగి 79.3 శాతానికి చేరింది.

ఈ స్థిరమైన వృద్ధి రానున్న నెలల్లో ఫ్రెషర్ల నియామకాలకు సంబంధించి సానుకూలతను సూచిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో ఈ–కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టార్టప్‌లు (55 శాతం), ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (53 శాతం), టెలికమ్యూనికేషన్స్‌ (50 శాతం) కంపెనీల్లో ఉద్దేశ్యం వ్యక్తమైంది.

ఇక ఐటీ రంగంలో మాత్రం గతేడాది మొదటి ఆరు నెలలో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశ్యం తగ్గుముఖం పట్టింది. 49 శాతం నుంచి 42 శాతానికి తగ్గింది. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 3 శాతం, ట్రావెల్‌ అండ్‌ హాస్పిటాలిటీలో 4 శాతం చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి నియామకాల ధోరణి తగ్గింది.  

చదవండి: Social Media: సోషల్‌ మీడియాలో 504 కోట్ల మంది.. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గంట‌లు వాడుతున్నాడంటే!!

వీరికి డిమాండ్‌.. 

గ్రాఫిక్‌ డిజైనర్, లీగల్‌ అసోసియేట్, కెమికల్‌ ఇంజనీర్, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించి ఫ్రెషర్లకు డిమాండ్‌ నెలకొంది. ఎన్‌ఎల్‌పీ, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ఐవోటీ, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, మెటావర్స్‌ ప్రముఖ డొమైన్‌ నైపుణ్యాలుగా ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ తెలిపింది. బెంగళూరులో ఫ్రెషర్లకు (69 శాతం) ఎక్కువగా అవకాశాలు రానున్నాయి.

చదవండి: Global Risk Report 2024: తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పు

ఆ తర్వాత ముంబైలో 58 శాతం, చెన్నైలో 51 శాతం, ఢిల్లీలో 51 శాతం చొప్పున ఫ్రెషర్లను తీసుకునే విషయంలో కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జెనరేషన్‌ ఏఐ ప్రభావం ఫ్రెషర్ల నియామకాలపై ఏ మేరకు ఉంటుందన్న దానిపైనా ఈ నివేదిక దృష్టి సారించింది. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, ఫైనాన్షియల్‌ అనలిస్ట్, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్‌ డిజైనర్, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్, టెక్నికల్‌ రైటర్లు, లీగల్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని గుర్తించింది.

ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, వాటిని అమలు చేయడం అన్నవి ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపింది. కనుక ఫ్రెషర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడమే కాకుండా, జెనరేషన్‌ ఏఐతో కలసి పనిచేసే విధంగా ఉండాలని సూచించింది. 18 రంగాల నుంచి 526 చిన్న, మధ్య, భారీ కంపెనీలను విచారించిన టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ ఈ వివరాలను నివేదికలో పొందుపరిచింది.

Published date : 19 Feb 2024 11:16AM

Photo Stories