Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
Sakshi Education
వైద్య, ఆరోగ్య శాఖల పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రకటనలపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ జూలై 26న కోరారు.
ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో పలు ఉద్యోగాల భర్తీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నోటిఫికేషన్ లేఖలతో వైద్య శాఖకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగ భర్తీ నియామకాల నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లోనే పొందుపరుస్తామని పేర్కొన్నారు.