Jobs: ఉన్నతవిద్యలో ఉద్యోగ విప్లవం
రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ఐటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వడంతో విశ్వవిద్యా లయ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 3220 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది ఇందులో భాగంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో 118 పోస్టులకు, నూతనంగా ఏర్పాటైన డా. వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంలో 138 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేశారు.
బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్‌లతో పాటు, రెగ్యులర్ నోటిఫికేషన్‌లు జారీచేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో సైతం పోస్టుల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సైతం అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నారు.
చదవండి: IIIT Basara: ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
అర్హత, రాతపరీక్ష.. ఇంటర్వ్యూ ద్వారా..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ, విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానంలో నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్థి అర్హతలకు అనగా పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, నెట్, సెట్, స్లెట్, జేఆర్‌ఎఫ్, అంతర్జాతీయ, జాతీయ పబ్లికేషన్స్, పరిశోధన తదితర అంశాల ఆధారంగా పారదర్శకంగా అభ్యర్థికి మార్కులు కేటాయించనున్నారు. అదే విధంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్‌ల (కాంట్రాక్ట్ అధ్యాపకులు)కు యేడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులకు వెయిటేజి ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి 4:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో నోటిఫికేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 31న నుంచే రిజిస్ట్రేషన్ నిర్వహించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఉన్నతవిద్యామండలి వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయం, పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
యోగివేమన విశ్వవిద్యాలయం (రెగ్యులర్ ప్లస్ బ్యాక్‌లాగ్)
అసిస్టెంట్ ప్రొఫెసర్లు : 43
అసోసియేట్ ప్రొఫెసర్లు : 46
ప్రొఫెసర్లు : 26
నాన్ అకడమిక్ పోస్టులు: 03
మొత్తం : 118
డా. వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయం
అసిస్టెంట్ ప్రొఫెసర్లు : 81
అసోసియేట్ ప్రొఫెసర్లు : 36
ప్రొఫెసర్లు: 16
నాన్ అకడమిక్ పోస్టులు : 05
మొత్తం : 138