CM Revanth Reddy: పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన జూలై 9న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్‌ఎం కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
పుట్టగతులుండవనే కుట్రలు
‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.
పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి
‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి.
కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీ
‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది.
నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.