Skip to main content

Degree: యూజీ ఆనర్స్‌.. ఇక జాబ్‌ ఈజీ

గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్‌ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి.
Degree
యూజీ ఆనర్స్‌.. ఇక జాబ్‌ ఈజీ

విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్‌ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్‌ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది.  

చదవండి: UGC: విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై యూజీసీ దృష్టి

కోర్సులు ఇలా... 

  • బీఏ ఆనర్స్‌ : హిస్టరీ, టూరిజం మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, స్పెషల్‌ ఇంగ్లిష్, స్పెషల్‌ తెలుగు ఒక మేజర్‌ సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్‌ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి.  
  • బీఎస్సీ ఆనర్స్‌: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హార్టిక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్‌ సబ్జెక్టులుగా ఫుడ్‌ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి.  
  • బి.కాం ఆనర్స్‌: బి.కాం జనరల్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్‌ మార్కెటింగ్, బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్, అకౌంట్స్‌ అండ్‌ టాక్సెస్‌ మేజర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి.  
  • యూజీ ఆనర్స్‌ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్‌ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్‌ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది.  

విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి.  
– డాక్టర్‌ భాగ్యలక్ష్మి, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ  

Published date : 24 Jun 2023 05:06PM

Photo Stories