NMC: ఈ కాలేజీలపై ఢిల్లీ నుంచి నిఘా
ఈ మేరకు డీఎంఈలకు లేఖ రాసింది. అలాగే, మెడికల్ కాలేజీలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఢిల్లీలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 2023లో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలల్లో ఫ్యాకల్టీ హాజరుకు సంబంధించి ఆధార్ నంబర్లతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేసింది. కొత్తగా ఏర్పాటుచేసే మెడికల్ కళాశాలలకు అనుమతులు జారీచేసే విషయంలో కఠిన నిబంధనలు విధించింది. నిబంధనలు పాటించని కళాశాలలకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గత ఏడాది అనుమతులు జారీ చేసిన కళాశాలలు సైతం కొత్త నిబంధనలు అమలు చేయాలని సూచించింది. గతంలో కొత్త మెడికల్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఎన్‌ఎంసీ బృందం తనిఖీలు చేసిన సమయంలో ఇతర కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని తమ కళాశాలల్లో పని చేస్తున్నట్లు చూపినట్లుగా గుర్తించింది.
చదవండి: NMC: వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
అలాగే, ఎన్‌ఎంసీ బృందం తనిఖీలలో సంబంధిత కళాశాలకు శాశ్వత భవనం లేనప్పటికీ ఉన్నట్లుగా చూపించడం, ఆ తరువాత ఇరుకు భవనాలలోనే కొనసాగించిన సంఘటనలు సైతం వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో తక్షణమే మెడికల్ కళాశాలలు అనుబంధ ఆస్పత్రులలో సీసీ టీవీలతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త మెడికల్ కళాశాలల్లో అన్ని నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించిన తరువాతనే అనుమతుల కోసం రిఫర్ చేయాలని సూచించింది. ఇప్పటికే మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, సంగారెడ్డిలో కళాశాలలు ఏర్పాటు కాగా తరగతులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 8 కళాశాలలను 2023లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.