NMC: వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ నుంచి వైద్య శాఖకు ఫిబ్రవరి 21న ఉత్తర్వులు అందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: 295 Jobs: మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఇందులో భాగంగా ఐదుచోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దడంతోపాటు ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్‌లకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకీ 2022లో దరఖాస్తు చేసింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో 5చోట్ల ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన నాలుగు కళాశాలలకు ఆమోదం లభించాల్సి ఉంది. వీటికి కూడా ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరుతాయి.
చదవండి: ఐదు కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
తొమ్మిదేళ్ల తర్వాత
రాష్ట్రంలో చివరిసారిగా 2014లో నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ కళాశాల ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏర్పాటుకు కృషి చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు కొమ్ముకాసింది. సీఎం వైఎస్ జగన్ కృషితో తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది.
చదవండి: నాన్ క్లినికల్ పీజీ... నాట్ ఇంట్రెస్టెడ్!
వైద్య రంగంలో మరో మైలురాయి
విజయనగరం వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎన్‌ఎంసీ ఆమోదం ఇవ్వడం శుభపరిణామం. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో మరో మైలురాయి వచ్చి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తొలుత విజయనగరం కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు లభించాయి. విజయనగరం వైద్య కళాశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమకూరుతుంది. మరో 4 కళాశాలలకు కూడా అనుమతులు లభిస్తాయని దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఆ సీట్లను 1,249 కు పెంచుకోగలిగాం. మరో 637 సీట్ల పెంపుదల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగాం.
– విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి