Skip to main content

Sri Krishnadevaraya University: రాష్ట్రంలో అగ్రగామిగా ఎస్కేయూ

Sri Krishnadevaraya University Celebrations of 42nd foundation day

అనంతపురం: నాణ్యమైన పరిశోధనలు.. అత్యుత్తమ బోధన, అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు.. సమాజోపయోగకరమైన ఆవిష్కరణలు అన్ని అంశాల్లోనూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో అగ్రగామిగా ఉంది’ అని వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్కేయూ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం భువన విజయం ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ... గడిచిన మూడేళ్లలో విశేషమైన మైలు రాయిని అధిగమించామన్నారు. అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తున్నామని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించిన ప్రాంతీయ వాతావరణ పరిశోధన స్థానంతో వర్సిటీ కీర్తి జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశామన్నారు. బోటనీ విభాగంలో 40 వేల స్పెసిమెన్లు ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును సృష్టించినట్లు వివరించారు. ఈ జాబితాలో దక్షిణ భారతదేశంలోనే రెండో వర్సిటీగా ఖ్యాతి దక్కిందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 ను పకడ్బందీగా అమలు చేస్తూ నైపుణ్యాధికారిత కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. మూడు స్నాతకోత్సవాలను నిర్వహించిన ఘనత లభించిందన్నారు. రూ.5 కోట్ల విలువైన ఇండోర్‌ స్టేడియంను పూర్తి చేసి రెండు నెలల్లో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. 86.76 ఎకరాల భూమిని రికవరీ చేసి వర్సిటీ ఆస్థిని పరిరక్షించామని పేర్కొన్నారు.

 

Sri Krishnadevaraya University: పూర్వ విద్యార్థుల సహకారంతోనే... వర్సిటీ అభివృద్ధి

అంకితభావంతో కష్టపడాలి..
విశిష్ట అతిథిగా హాజరైన యూపీఎస్సీ మాజీ సభ్యులు వై. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిందన్నారు. అనంతరం జేఎన్‌టీయూ అనంతపురం తదితర వర్సిటీలు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చినప్పటికీ తనలోని ప్రతిభను గుర్తించిన తొలి వర్సిటీ ఎస్కేయూ అని స్పష్టం చేశారు. ఎస్కేయూనివర్సిటీ ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎంతో మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వెంట్లను అందించిన ఘనత ఉందన్నారు. అంకితభావంతో కష్టపడితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో యోగివేమన వర్సిటీ వీసీ చింతా సుధాకర్‌ (ఎస్కేయూ పూర్వ విద్యార్థి), రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్‌ ఏ. కృష్ణకుమారి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రీడలు, వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ బహుమతులు ప్రదానం చేశారు.

నాణ్యమైన పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా గుర్తింపు ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అట్టహాసంగా ఎస్కేయూ 42వ ఆవిర్భావ దినోత్సవం నాయకులుగా ఎదగాలి..
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... రామకృష్ణారెడ్డి వీసీ అయిన తరువాత వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన జరిగిందన్నారు. రోడ్లు, భవనాలు ఈ మధ్యనే గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఉస్మానియా యూనివర్సిటీ ఘనతేనన్నారు. బలహీనులకు , పుట్టిన ఊరు, ప్రాంతానికి దన్నుగా నిలవాల్సిన నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం కలగాలని, బాగా చదివి బాగా జీవితంలో రాణించాన్నారు. వర్సిటీలో అనేక కోర్సులు ఉన్నాయని, ఈ ప్రాంత వ్యవసాయాభివృద్థికి దోహదపడే అగ్రికల్చర్‌ బీఎస్సీ, డెయిరీ సైన్సెస్‌ కోర్సులు వర్సిటీలో ఏర్పాటు చేయాలని వీసీని కోరారు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కాబట్టి వచ్చే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఈ కోర్సులను సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించాలని ఆశిస్తున్నానన్నారు. అగ్రికల్చర్‌ బీఎస్సీ అనంతపురంలో కేవలం ప్రైవేట్‌ కళాశాలల్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఎస్కేయూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ మధ్య కాలంలోనే వీసీ సహకారంతో వర్సిటీలో మెగా జాబ్‌మేళాను నిర్వహించి 1200 మందికి ఉద్యోగాలు కల్పించడం హర్షణీయమన్నారు. ఆర్‌.సీ.రెడ్డి స్టడీ సర్కిల్‌ వంటి కోచింగ్‌ సెంటర్ల సహకారంతో ఎస్కేయూ విద్యార్థులకు గ్రూప్స్‌కు కోచింగ్‌ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృషి చేస్తామన్నారు. ఇందుకు గాను రూ.10 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Published date : 29 Jul 2023 02:37PM

Photo Stories