Sri Krishnadevaraya University: పూర్వ విద్యార్థుల సహకారంతోనే... వర్సిటీ అభివృద్ధి
అనంతపురం: పూర్వ విద్యార్థుల సహకారంతోనే వర్సిటీ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం జరిగే ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఎస్కేయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ ఎస్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ నాటి మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నాయకులుగా ఉంటూ విభిన్న రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎందరో తమ ఆత్మీయ భావాలను పంచుకున్నారు. భువన విజయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. వర్సిటీలో చదువుకుని బహుళజాతి సంస్థల్లో కీలకమైన కొలువుల్లో ఉన్నవారు, సివిల్ సర్వీసెస్ సాధించిన వారు, పారిశ్రామికవేత్తలుగా స్థిరపడినవారు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వారు ఈ స్థాయికి ఎదగడానికి దోహదపడింది వర్సిటీనే అనే అంశాన్ని మరవరాదన్నారు. ఇకపై ఏటా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటించారు. ఎస్వీయూ మాజీ వీసీ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నాటి గురువుల ఔనత్యాన్ని కొనియాడారు. ప్రొఫెసర్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. ఎస్కేయూతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ వర్సిటీ విద్యార్థినని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్‌పర్సన్ రాగే హరిత, రిజిస్ట్రార్ ఎంఏ లక్ష్మయ్య, రైపర్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రవీంద్రారెడ్డి, సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్, అడ్వకేట్ డాక్టర్ పద్మలత, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరన గౌరవ అతిథులను ఘనంగా సత్కరించారు. వర్సిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి అట్టహాసంగా ఎస్కేయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేడు వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు